
ప్రస్తుత ప్రపంచంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఎఐ) మౌలిక సదుపాయాలు కూడా రహదార్లు, ఓడరేవుల వంటి వ్యూహాత్మక జాతీయ ఆస్తులుగా మారుతున్నాయి. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం, రాబోయే ఐదేళ్లలో భారతదేశంలోని డేటా సెంటర్లలో దాదాపు 7 లక్షల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (జిపియులు) మోహరించే అవకాశం ఉంది. ఇది దాదాపు 23 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాన్ని సృష్టిస్తుంది. దేశంలో ఎఐ స్వీకరణ, డేటా సెంటర్ల విస్తరణ అనేది ఒక భారీ ఆర్థిక అవకాశాన్ని తెరిచింది. 2025 లో 1.6 గిగావాట్ల (జిడబ్ల్యు)గా ఉన్న భారత్ నిర్మిత డేటా సెంటర్ సామర్థ్యం, 2030 నాటికి దాదాపు 5 జిడబ్ల్యుకు చేరుకుంటుందని అంచనా. దీని వలన దాదాపు 25 బిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడి అవసరమవుతుంది. 2024లో 10 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశపు ఎఐ మార్కెట్, 39 శాతం సమ్మేళన వార్షిక వృద్ధిరేటు (సిఎజిఆర్)తో 2032 నాటికి 131 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇతర అంచనాల ప్రకారం, కృత్రిమ మేధ భారత ఆర్థిక వ్యవస్థకు 2035 నాటికి 1.7 ట్రిలియన్ డాలర్లను జోడించగలదని ప్రభుత్వ అంచనా.
ఉపాధి & నైపుణ్యాభివృద్ధి: ప్రస్తుతం భారతదేశపు టెక్నాలజీ రంగంలో 60 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2024లో ప్రారంభించిన ‘ఇండియా ఎఐ మిషన్’ కింద ఇప్పటికే సుమారు 38,231 జిపియులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ జిపియులు భారతీయ స్టార్టప్‌లు, అకాడమియాకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ఇది కొత్త రకాల ఉద్యోగాల సృష్టికి అలాగే దేశీయ పరిశోధనలను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. ఎఐ యుగంలో జిపియులు పారిశ్రామిక యంత్రాలతో సమానంగా మారుతున్నాయి. పెద్దఎత్తున కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు లభ్యత కలిగిన దేశాలు ఎఐ మోడల్ డెవలప్‌మెంట్, డిఫెన్స్ టెక్నాలజీలు అలాగే ఎంటర్‌ప్రైజెస్, ఆటోమేషన్‌లో అసమాన ప్రయోజనాలను పొందగలవు. అదే సమయంలో, ప్రతి మౌలిక సదుపాయాల విస్తరణ వలే, ఎఐ డేటా సెంటర్లకు కూడా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయి.
నష్టాలు & సవాళ్లు: అధిక విద్యుత్ వినియోగం: ఎఐ డేటా సెంటర్లు చాలా ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. 2030 నాటికి భారతదేశంలో డేటా సెంటర్ లోడ్ 1.2 జిడబ్ల్యు నుండి 4.5 జిడబ్ల్యుకు అవసరమవుతుందని, ఎఐ-డ్రివెన్ ఫెసిలిటీలు మాత్రమే సంవత్సరానికి అదనంగా 40 50 టెరావాట్ -గంటల (టిడబ్ల్యుహెచ్) విద్యుత్తును వినియోగించగలవని అంచనా. డేటా సెంటర్లు 2030 నాటికి భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 5 శాతాన్ని వినియోగిస్తాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దాదాపు 13.5 జిడబ్ల్యు వరకు ఎలక్ట్రిసిటీ డిమాండ్ ను చేరుకోవచ్చు. ప్రస్తుత ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌పై ఈ ఒత్తిడి, భారీ స్థాయి విద్యుత్ కోతలకు లేదా వోల్టేజ్ అస్థిరతకు కారణం కావచ్చు.
డేటా సెంటర్లు అధిక ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి భారీ మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి. 2024లో భారతదేశపు డేటా సెంటర్లు సుమారు 150 బిలియన్ లీటర్ల నీటిని వినియోగించుకున్నాయి. అలాగే 2030 నాటికి ఈ సంఖ్య 358 బిలియన్ లీటర్లకు దాదాపు రెట్టింపు లేదా మూడు రెట్లు అవుతుంది. ఒక్క డేటా సెంటర్ రోజుకు సుమారు 20 లక్షల లీటర్ల నీటిని ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న భారతదేశంలో, ఇది స్థానిక జలాశయాలను మరింత దెబ్బతీస్తుంది. పెద్ద నగరాల్లో డేటా సెంటర్లు కేంద్రీకృతమై ఉండటం వలన ఈ నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.
పర్యావరణంపై ప్రభావం: కార్బన్ ఉద్గారాలతోపాటు, ఇంకా పర్యావరణానికి ఇతర నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఇ -వేస్ట్ ఉత్పత్తి చేసే దేశం. జిపియులు అలాగే ఎఐ హార్డవేర్ ర్యాపిడ్ రీప్లేస్‌మెంట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా, దక్షిణాసియాలో చాలా వరకు ఎఐ విస్తరణ దృశ్యాలు ఇప్పటికీ స్థిరత్వ పరిగణనలను పూర్తిగా విడిచిపెడుతున్నాయి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోని 20 శాతం డేటాను సృష్టిస్తుండగా, ప్రపంచంలోని డేటా సెంటర్లలో కేవలం 3 శాతం మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇది పెద్ద వృద్ధి అవకాశాన్ని సూచిస్తుంది. కానీ భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడులు అవసరమవుతాయి. వాణిజ్య దృక్కోణం నుండి, ఇది లాభదాయకంగా కూడా ఉంటుంది. పెద్ద- స్థాయి జిపియు మోహరింపులు 25.5 శాతం నుండి 28 శాతం వరకు అంతర్గత రాబడి రేటును సృష్టించగలవు. ఇది పెట్టుబడిని ఆకర్షిస్తుంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో డేటా సెంటర్ కెపాసిటీ సుమారు 1.6 జిడబ్ల్యు నుండి 5 జిడబ్ల్యుకు చేరుకోబోతోంది. ఇది పెట్టుబడిదారులు అలాగే టెక్నాలజీ సంస్థలకు ఒక సువర్ణ అవకాశం కూడా.
భారతదేశం తన డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడం ద్వారా తన కృత్రిమ మేధ లక్ష్యాలను సాధించాలనుకుంటోంది. ఇది అమలు చేయబడిన భారీ పెట్టుబడులు నిస్సందేహంగా ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తాయి, సాంకేతిక రంగాన్ని ముందుకు నడిపిస్తాయి. అయితే, దీని కోసం అధిక విద్యుత్, భారీ మొత్తంలో నీటి వినియోగం వల్ల కలిగే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడం చాలా అవసరం. భారతదేశం 2030 నాటికి 50 శాతం పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, ఎఐ వృద్ధి ఆ ఇంధన పునాదులను పరీక్షించనుంది. అదే విధంగా, తీవ్ర నీటి కొరత ఉన్న దేశంలో, సాంప్రదాయ జల శీతలీకరణ ప్రత్యామ్నాయాలు ఇకపై సాధ్యం కాకపోవచ్చు. అలాగే, నివేదికల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి డేటా సెంటర్ విధానాలలో సస్టైనబిలిటీ ప్రొవిజన్లు చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశం విజయం సాధించాలంటే, ఈ అంతరాలను వెంటనే పూడ్చుకోవాలి.
- కోలాహలం రామ్ కిశోర్
98493 28496











