
వ్యవసాయ రంగంలో అధిక దిగుబడుల కోసం రైతులు సంవత్సరాలుగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. మొదట్లో మంచి ఫలితాలు ఇచ్చిన ఈ ఎరువులు ప్రస్తుతం భూమి సారవంతాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరియా, డిఎపి, పొటాష్ వంటి రసాయన ఎరువులను అధికంగా వాడటం వల్ల నేలలోని సహజ సూక్ష్మజీవులు నశించి, భూమి పోషక విలువలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గిపోవడం, నేల గట్టిపడటం, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయం చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు రైతులకు మేలు చేస్తున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పశువుల ఎరువు, జైవామృతం, ఘన జీవామృతం, వెర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ పద్ధతులు భూమి సహజ సారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండటంతోపాటు పంటలకు అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి. రసాయన ఎరువుల ఖర్చు తగ్గడంతో రైతుల ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. సేంద్రియ పద్ధతుల్లో పండిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం రైతులకు అదనపు లాభాలను తెస్తోంది. దేశంలో రసాయన ఎరువుల ధరలు క్రమంగా పెరుగుతుండటం రైతులపై అదనపు భారంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సబ్సిడీలు అందిస్తున్నప్పటికీ, దీని ద్వారా పెద్ద ఎత్తున లాభాలు కార్పొరేట్ ఎరువుల కంపెనీలకే చేరుతున్నాయని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
ప్రతి సీజన్లో ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో రైతులు అప్పుల బారిన పడుతున్నారు. మరోవైపు సేంద్రియ వ్యవసాయానికి సరైన ప్రోత్సాహం, మార్కెట్ సదుపాయాలు లేకపోవడం రైతులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడిన పంటలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్, చర్మవ్యాధులు, జీర్ణసమస్యలు, హార్మోన్ అసమతుల్యత వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక డిమాండ్ ఏర్పడుతోంది. రైతులు కూడా భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సేంద్రియ ఎరువుల వినియోగాన్ని గ్రామీణ స్థాయి నుంచే రైతులకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని నిపుణులు, రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగంవల్ల భూమి సారవంతం తగ్గిపోవడం, పంట దిగుబడులు దెబ్బతినడం, ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలను గ్రామాల స్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తే భూమి ఆరోగ్యం కాపాడటంతో పాటు రైతుల ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పథకాలు, సబ్సిడీలు, మార్కెట్ సదుపాయాలు కల్పిస్తే రైతులు మరింతగా ఆ దిశగా ముందుకు వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలం సేంద్రియ వ్యవసాయానికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
- వర్ని సంతోష్
96667 89710












