దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల/ -కమాల్ మౌలా మసీదు సముదాయంలోని వివాదాస్పద ప్రాంతంపై అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదాస్పద స్థలం దేవీ సరస్వతి ఆలయానికే చెందుతుందని ఇందౌర్ ద్విసభ్య ధర్మాసనం హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా 2003లో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) జారీ చేసిన, భోజ్‌శాల ప్రాంగణంలో ముస్లింలకు శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. అయితే భోజ్‌శాల నిర్వహణ బాధ్యతలు భారత పురావస్తు శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. కానీ ఆ ప్రదేశంలో మతపరమైన ఆచారాలు, పూజలు నిర్వహించే హక్కు మాత్రం హిందూ పక్షానికేనని పేర్కొంది. ఈ ఆలయంలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది.


ముస్లిం సమాజం కోసం జిల్లా పరిధిలో వేరే ప్రదేశంలో మసీదు నిర్మాణానికి భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని కూడా కోర్టు సూచించింది. న్యాయమూర్తులు విజయ్‌కుమార్ శుక్లా, అలోక్ అవస్థి ధర్మాసనం తమ తీర్పులో భోజ్‌శాలలో సంసృ్కత విద్యాకేంద్రం, దేవీ సరస్వతి ఆలయం ఉన్నట్లు సూచించే ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రదేశంలో హిందూ ఆరాధన నిరంతరంగా కొనసాగినట్లు మేము గమనించాము. చారిత్రక ఆధారాలు, సాహిత్య సమాచారం ప్రకారం పరమార వంశానికి చెందిన రాజా భోజ్‌తో సంబంధం ఉన్న సంసృ్కత విద్యాకేంద్రంగా భోజ్‌శాల గుర్తింపు పొందింది అని కోర్టు వ్యాఖ్యానించింది. హిందూ వర్గాలు భోజ్‌శాలను వాగ్దేవి అయిన సరస్వతి దేవికి అంకితమైన ఆలయంగా, రాజా భోజ్ నిర్మించిన కట్టడంగా భావిస్తున్నాయి. మరోవైపు ముస్లిం వర్గాలు ఈ ప్రదేశం శతాబ్దాలుగా కమాల్ మౌలా మసీదుగా ఉపయోగంలో ఉందని వాదిస్తున్నాయి. ఇక ప్రస్తుతం లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ప్రాచీన సరస్వతి దేవి విగ్రహాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

పరమార వంశానికి చెందిన రాజా భోజ్ క్రీస్తుశకం 1010 నుంచి 1055 మధ్యకాలంలో ఈ సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు కోర్టు పేర్కొంది. ఆ కాలంలో భోజ్‌శాల ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. భోజ్‌శాల పరిరక్షణ, సంరక్షణపై పూర్తి పర్యవేక్షణాధికారం భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కే ఉంటుంది. ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతి దేవి విగ్రహాన్ని తిరిగి భోజ్‌శాల సముదాయంలో ప్రతిష్ఠించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిపై వారు ప్రభుత్వానికి అనేక వినతిపత్రాలు సమర్పించారు. ఆ విగ్రహాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావడంపై ప్రభుత్వం పరిశీలించవచ్చు అని న్యాయస్థానం తెలిపింది. వివిధ మతపరమైన విశ్వాసాలు, చారిత్రక వాదనలు, సంక్లిష్ట న్యాయపరమైన అంశాలు, వేలాది పత్రాలను పరిశీలించిన అనంతరం హైకోర్టు మే 12న తీర్పును రిజర్వ్ చేసుకుంది.

2003లో భారత పురావస్తు శాఖ రూపొందించిన విధానం ప్రకారం మంగళవారం హిందువులు, శుక్రవారం ముస్లింలు అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే భోజ్‌శాల సముదాయంలో ప్రత్యేక పూజా హక్కులు తమకే ఇవ్వాలని కోరుతూ హిందూ పక్షం హైకోర్టును ఆశ్రయించింది. భోజ్‌శాల/-కమాల్ మౌలా మసీదు సముదాయంపై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు 2024 మార్చి 11న భారత పురావస్తు శాఖను ఆదేశించింది. అనంతరం మార్చి 22న ఏఎస్‌ఐ సర్వే ప్రారంభించి, 98 రోజులపాటు విసృ్తత పరిశీలన చేపట్టి కోర్టుకు నివేదిక సమర్పించింది. 2,000కు పైగా పేజీలతో కూడిన తన నివేదికలో ధార్ పరమార రాజుల కాలానికి చెందిన భారీ నిర్మాణం మసీదు కంటే ముందే అక్కడ ఉన్నట్లు ఏఎస్‌ఐ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వివాదాస్పద నిర్మాణం ఆలయ అవశేషాలను ఉపయోగించి నిర్మించబడినట్లు నివేదికలో వెల్లడించింది. శాస్త్రీయ సర్వేలో లభ్యమైన నాణేలు, శిల్పాలు, శాసనాలు ఈ సముదాయం తొలుత ఆలయంగానే ఉన్నట్లు నిరూపిస్తున్నాయని హిందూ పక్షం వాదించింది. అయితే ఏఎస్‌ఐ నివేదిక పక్షపాత ధోరణితో రూపొందించబడిందని, హిందూ పిటిషనర్ల వాదనలకు మద్దతు ఇవ్వడానికే దాన్ని సిద్ధం చేశారని ముస్లిం పక్షం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది.