
దేశవ్యాప్తంగా ఈనెల 20న మెడికల్ షాపులు బంద్ కానున్నాయి.ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలు ఒకరోజు పాటు తీవ్రంగా ప్రభావితం కానుంది. ఈ బంద్‌లో సుమారు 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్(AIOCD) తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కోనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ఏఐఓసిడి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మెడికల్ షాపులు, కొన్ని ఔషధ సరఫరా సంస్థలు కూడా బంద్ కానున్నాయి. ఆన్ లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ చిన్న మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీ కంపెనీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు.












