
హైదరాబాద్: జహీరాబాద్ ను పారిశ్రామిక కారిడార్ గా మారుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గ్రామంలో కాలుష్య నీరు ప్రవహించకుండా రీసైక్లింగ్ చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా తోగర్ పల్లి-అలియాబాద్ లో కెజిఎస్ పరిశ్రమకు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. యువత నైపుణ్యాలు మెరుగుపర్చి రాష్ట్రాన్ని శక్తిమంతంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని, పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. పెట్టుబడుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాల కోసం..జాతీయ ఉత్పత్తిలో రాష్ట్రంలో వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా గుర్తించి ముందుకు సాగుతున్నామని, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు కావాలని శ్రీధర్ బాబు కోరారు.











