అమెరికా నేలపై మరోసారి తెలుగు సంస్కృతి సిరులు విరబూయబోతున్నాయి. వేల మైళ్ల దూరంలో ఉన్నా.. మాతృభాషపై మమకారం, సంప్రదాయాలపై ప్రేమ, తెలుగు జాతి ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పే మహోత్సవంగా ‘మన అమెరికా తెలుగు సంఘం’ (MATA) రెండో మహాసభలు (MATA 2nd Convention ’26) ఘనంగా జరగబోతున్నాయి. జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఓక్స్ నగరంలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్ తెలుగు సంబరాలతో మార్మోగనుంది.

అమెరికాలో తెలుగు వైభవానికి మహా వేదిక:

ప్రపంచ నలుమూలల నుంచి అమెరికాకు చేరుకున్న తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. సంస్కృతి, సాహిత్యం, వినోదం, ఆధ్యాత్మికత, సాంకేతికతలను కలగలిపిన అద్భుత వేడుకగా ఈ మహాసభలను రూపొందిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే అనుభూతిని అందించేలా నిర్వాహకులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.

భద్రాచలం నుంచి అమెరికా వరకు… భక్తి యాత్ర:

ఈసారి మహాసభల్లో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది “A Divine Journey Across America”. మే 30 నుంచి టంపా, శాన్ ఆంటోనియో, డల్లాస్, అట్లాంటా నగరాల్లో భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించనున్నారు. అమెరికా నేలపై శ్రీరామ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.

ఈ భక్తి యాత్రకు ముగింపుగా జూన్ 20న కన్వెన్షన్ వేదికపై భద్రాచలం నుంచి విచ్చేసే అర్చకుల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరగనుండటం విశేషం. ప్రవాస భారతీయులకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతిగా మారనుంది.

సంగీతంతో మోగనున్న అమెరికా:

తెలుగు సంగీత ప్రేమికులకు ఈ మహాసభలు సంగీత పండుగగా మారనున్నాయి. జూన్ 19న ఫోక్, మాస్ బీట్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే గాయకుడు రామ్ మిర్యాల లైవ్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 20న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) మెగా మ్యూజికల్ షోతో స్టేజ్‌ను షేక్ చేయనున్నారు.

సుమ కనకాల తన హాస్య చతురతతో అలరించనుండగా.. ఐశ్వర్య రాజేష్, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలకు ప్రత్యేక మెరుపులు అద్దనున్నారు.

యువత కోసం ఫ్యూచర్ టెక్నాలజీ:

భవిష్యత్ తరాలకు సాంకేతిక ప్రపంచాన్ని చేరువ చేసేలా ప్రత్యేకంగా ‘యూత్ ఫోరమ్’ ఏర్పాటు చేస్తున్నారు. AI ఆధారిత హ్యాకథాన్‌లు, ‘AI Powered Learning’ సెషన్లు, సినీ తారలతో ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే వేదికగా MATA మహాసభలు నిలవబోతున్నాయి.

క్రీడల సందడి కూడా అదిరేలా:

కేవలం సాంస్కృతిక వేడుకలకే పరిమితం కాకుండా.. క్రీడా పోటీలతో కూడా తెలుగు యువతలో ఉత్సాహం నింపుతున్నారు. వాలీబాల్, పికిల్‌బాల్, క్రికెట్, మహిళల త్రోబాల్, చెస్ టోర్నమెంట్లు అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు.

ప్రవాసుల కోసం సేవా కార్యక్రమాలు:

ప్రవాస తెలుగు కుటుంబాల ఆరోగ్యం, న్యాయ అవగాహన కోసం కూడా MATA ముందుకు వస్తోంది. ఎడిసన్‌లో ప్రతి నెల ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు, ప్రతి నెల చివరి శనివారం జూమ్ ద్వారా ఉచిత న్యాయ సదస్సులు నిర్వహిస్తున్నారు.

వ్యాపార అవకాశాలకు బంగారు బాట:

తెలుగు వ్యాపారవేత్తలకు తమ వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసుకునే అరుదైన అవకాశంగా ఈ మహాసభలు మారనున్నాయి. వెండర్ బూత్‌లు, సావనీర్ ప్రకటనలు, రియల్ ఎస్టేట్, జ్యువెలరీ, ఇతర సేవల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉంచారు.

శ్రీనివాస్ గనగోని, రమణ కిరణ్ దుడ్డగి, శ్రీధర్ గూడల తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. అమెరికాలోని ప్రతి తెలుగు కుటుంబం ఈ మహాసభల్లో పాల్గొని తెలుగు జాతి ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.

తెలుగు సంస్కృతి… తెలుగు గర్వం… తెలుగు ఐక్యతకు ప్రతీకగా నిలిచే MATA మహాసభలు ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారాయి.