నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ NATS జాతీయ నాయకత్వ బృందం నార్త్ కరోలినాలోని షార్లెట్ చాప్టర్ ప్రతినిధులతో శనివారం (జూలై 18) కీలక సమావేశం నిర్వహించింది. భవిష్యత్ కమ్యూనిటీ కార్యక్రమాలు, తెలుగు సమాజ అభివృద్ధి, అలాగే 2027లో జరగనున్న ప్రతిష్ఠాత్మక "అమెరికా తెలుగు సంబరాలు" మహాసభలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు అజయ్ గోవాడ, ఎగ్జిక్యూటివ్ కమిటీ వెబ్ సెక్రటరీ కిషోర్ నారే, ఇండియా లైజన్ నేషనల్ కోఆర్డినేటర్ అరుణ్ శ్రీరామనేని పాల్గొన్నారు. షార్లెట్ చాప్టర్ తరఫున సిద్ధార్థ చాగంటి, దీపిక సయ్యపరాజు, లక్ష్మి బిజ్జాల, రూప మార్రి, వినీల దోపలపూడి, సుమ జుజ్జూరు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ కిషోర్ కంచర్ల షార్లెట్ చాప్టర్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా మహిళా సభ్యులు చూపుతున్న నాయకత్వం, ఉత్సాహం, సేవాభావం వల్ల చాప్టర్ ఎంతో చురుకుగా ముందుకు సాగుతోందని ప్రశంసించారు.

అలాగే 2027 మే 28 నుంచి 30 వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న "అమెరికా తెలుగు సంబరాలు" మహాసభల ఏర్పాట్లలో షార్లెట్ చాప్టర్ కీలక బాధ్యతలు చేపట్టాలని అధికారికంగా ఆహ్వానించారు.

షార్లెట్ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న తెలుగు సమాజాన్ని మరింత ఏకం చేసేందుకు కొత్త కార్యక్రమాలు చేపట్టాలని జాతీయ నాయకత్వం సూచించింది. స్థానిక చాప్టర్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి నాట్స్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చింది.

షార్లెట్ చాప్టర్ కోఆర్డినేటర్ దీపిక సయ్యపరాజు మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా కలవడం, వారి ప్రశంసలు అందుకోవడం తమ బృందానికి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో తెలుగు సమాజానికి మరింత చేరువవుతామని ఆమె తెలిపారు.