ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూరు కలెక్టరేట్ ముందు నిర్వహించిన నిరసన దీక్ష కారణంగా ఈ కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.

తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షే ఆయనపై మరో కేసు నమోదుకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించడమే కాకుండా, తద్వారా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలతో నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఇప్పటికే సత్తెనపల్లి లక్కీడ్రా ఉదంతం, సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుల్లో అంబటి రాంబాబు 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉండి, బెయిల్‌పై విడుదలయ్యారు. బయటకు వచ్చిన కొన్ని రోజులకే నిరసన దీక్ష పేరిట నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై మళ్లీ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.