
ప్రపంచానికి ఇది ఒక పరివర్తనా దశ. లేదా సంధి కాలం. గతంలోని అనేక సామ్రాజ్యాలవలెనే, అమెరికన్ సామ్రాజ్యం కూడా శిధిలమై పతనమయే దశలోకి అడుగుపెడుతున్నది. ఆ పతనం ఇప్పటికిప్పు డు జరుగుతుందని కాదు. ఎప్పటికి జరిగేదీ జోస్యం చెప్పలేము. ఆ దశ మొదలైందన్నది మాత్రం ఎదురుగా కనిపిస్తున్న వాస్తవం. ఈ దశకు ఒక ప్రధాన కారణం అమెరికా అంతర్గత బలహీనతలు, ఒత్తిడులు, కోల్పోతున్న ఆధిక్యతలు. రెండవ ప్రధాన కారణం తక్కిన ప్రపంచం తన స్థాయిలో తాను క్రమంగా బలపడుతుండటం, స్వతంత్ర ధోరణులను అవలంబిస్తుండటం. గతంలో ప్రతి సామ్రాజ్య పతనం కూడా ఇదే మార్గంలో జరిగింది. అమెరికా అందుకు మినహాయింపు కాబోదు. ఆ సూచనలు పైన పేర్కొన్న విధంగా ఎదురుగా ఉన్నవే. అందువల్ల అమెరికాకు ప్రపంచం బందీ అయి తీరవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ సందర్భంలో భారతదేశం గ్రహించవలసింది చాలానే ఉంది. ఈ దేశంలో 1947 లో స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత గత సుమారు 80 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంత అభివృద్ధి సాధించవలసి ఉండెనో అంత సాధించలేదు. అదే సమయంలో ఇక్కడి సహజ వనరులు, ప్రజల శక్తియుక్తులు అపారమైనవి.
ప్రపంచం అమెరికాకు బందీ అయి తీరాలా? నిజానికి కానక్కర లేదు. ఆధిపత్యం వేరు, బందీ కావటమనే స్థితి వేరు. ఈ తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అమెరికా అగ్రరాజ్యమన్నంత వరకు సందేహం లేదు. ఆర్థికంగా, సైనికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో, రాజకీయ ప్రాబల్యం రీత్యా ఎవరికి ఎదురులేని బలం ఉంటే వారే అగ్రరాజ్యమవుతారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్నది అమెరికాయే. ఆ విధంగా వారు ప్రపంచంపై ఆధిపత్యం నెరపటం వేరు. అంతమాత్రాన వారేమీ చేసినప్పటికీ అందుకు ప్రపంచం బందీ అయితీరాలా? పైన పేర్కొన్న నాలుగు విధాలైన బలాలు అమెరికాకు చేకూరటం మొదటి ప్రపంచ యుద్ధకాలం నుంచి మొదలు కాగా, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతనుంచి వేగం అందుకున్నాయి. బ్రిటన్, జర్మనీ, ఇటలీ వంటి సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి. ఆ నాలుగు బలాలకు తోడు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), రిజర్వ్ కరెన్సీగా డాలర్, స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా అన్ని అంతర్జాతీయ చెల్లింపులు డాలరు మారకంలోనే జరగటం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 సైనిక స్థావరాల ఏర్పాటు, నాటో సైనిక కూటమి సృష్టి, తర్వాత కాలంలో ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) స్థాపన వంటివి అమెరికాకు తిరుగులేని బలాన్ని తెచ్చిపెట్టాయి. ఐక్యరాజ్య సమితి వంటివి అన్ని దేశాలకు సభ్యత్వం ఉండే సంస్థలు అయినప్పటికీ అమెరికా కనుసన్నలలోనే పనిచేస్తూ వచ్చాయి.
1991 లో సోవియెట్ యూనియన్ పతనం వరకు ద్విధ్రువంగా ఉండిన ప్రపంచం ఆ తర్వాత ఏకధ్రువంగా మారింది. విషయం ఏమంటే, 1945 నుంచి సుమారు 2010 వరకు అమెరికన్ అధ్యక్షులందరూ ప్రపంచంపై తమ ఆధిపత్య విధానాలను సాగించారు. తర్వాత 2010 నుంచి, డొనాల్డ్ ట్రంప్ 2025లో రెండవసారి అధికారానికి వచ్చే వరకు కూడా ఆయా అధ్యక్షుల కాలంలో కొంత తక్కువస్థాయిలోనైనా అమెరికా ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది గాని, ఇపుడు మనం చూస్తున్న విధంగా ట్రంప్ అనే ఒక అధ్యక్షుని చర్యలకు ప్రపంచం బందీగా మారలేదు. లేదా ఏ అధ్యక్షుడూ అట్లా మార్చ జాడ లేదు. ఇక్కడ ఒక వివరణ అవసరం. అమెరికా ఆధిపత్య స్థాయి 2010 నుంచి తగ్గుతూ వచ్చిందని చెప్పుకున్నాము. అట్లా తగ్గటానికి మూడు కారణాలున్నాయి. ఒకటి, 1991 లో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వేరే దేశంగా మిగిలిన రష్యా, వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలో తిరిగి పుంజుకోవటం. ఆర్థికంగా, సైనికంగా రాజకీయ పలుకుబడి రీత్యా కూడా. ఆ క్రమంలోనే కొన్ని తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలతో కలిసి ఆయన కొత్త కూటాలను నెలకొల్పగలిగారు. అమెరికా ఏకధ్రువ ప్రాబల్యంపై ఆ విధంగా కొంత నియంత్రణ ఏర్పడింది.
ఇది మొదటి కారణం కాగా, ఇంచుమించు అదే దశనుంచి మొదలుకొని చైనా మహావేగంగా అభివృద్ధి చెందసాగింది. ఆర్థికంగా, సైనికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా. దానికి తోడు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్, షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్, బ్రిక్స్ ఏర్పాటుతో పాటు తన ఆర్థిక, సాంకేతిక శక్తులతో అనేక ప్రపంచ దేశాలకు సహాయం చేయటం, అమెరికా ఏకధ్రువానికి బదులు బహుళ ధ్రువప్రపంచమనే నినాదాన్ని ముందుకు తేవటం, ఆ నినాదం పలు దేశాలను ఆకర్షించటం, కొన్ని దేశాలు స్వయంగా అభివృద్ధి చెందుతుండటం రెండవ కారణమైంది. ఇక మూడవది అమెరికా, యూరప్‌లతోపాటు వాటి మిత్రదేశాలలో 2008లో తలెత్తిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. ఆ పరిణామం 1929 నాటి ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది. దానితో, పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక విధానాలలో, వ్యవస్థలలో పెద్ద లోపాలే ఉన్నాయని, అవి మధ్య మధ్య బయటపడవచ్చుననే అభిప్రాయం తక్కిన దేశాలలో ఏర్పడింది. 2008 నాటి సంక్షోభ ప్రభావం రష్యా, చైనాలలో స్వల్పంగా తప్పలేకపోటాన్ని ప్రపంచం గమనించింది. అమెరికా, యూరప్, వాటి మిత్ర దేశాలు ఆ కాలంలో సాగించిన ఇరాక్, అఫ్ఘాన్, లిబియా తదితర యుద్ధాలు కూడా అమెరికాపై ప్రతికూల ప్రభావాలు చూపాయి.
ఒక మహా వృక్షాన్ని చెదలు లోలోపలి నుంచి తినివేసినట్లుగా, ఈ వివిధ పరిణామాలు అమెరికాపై ప్రభావాన్ని చూపసాగాయి. ప్రభావం చూపటమంటే ఒత్తిడిని పెంచటం. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒత్తిడులు పెరుగుతూపోవటం వల్లనే అమెరికా ప్రపంచంపై ఆధిపత్యం సాగించిన దశ నుంచి, ట్రంప్ హయాం వచ్చేసరికి ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రపంచాన్ని తన ప్రయోజనాల కోసం అన్నివిధాలా బందీగా మార్చుకొనజూసే దశకు వచ్చిచేరింది. ఆధిపత్యం చేజారిపోతున్నదనే భయం ఎంతటి ఒత్తిడిని సృష్టిస్తున్నదంటే, చివరకు తమ సాటి పాశ్చాత్య రాజ్యాలను, నాటో సభ్యదేశాలను సైతం బాహాటంగా బెదిరించే స్థితికి వెళ్లారు. అందుకు ఆ దేశాల తీవ్ర నిరసనలు, అమెరికాకు సహాయ నిరాకరణలు, భవిష్యత్తులో తమ దారి తాము చూసుకునే ప్రయత్నాల వంటివి ఇటీవల కనిపిస్తున్నవే. ఆ విధంగా ట్రంప్ హెచ్చరికలతో అసలు నాటో భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్నది. యూరోపియన్ దేశాలు ఒక్కొక్కటిగా ట్రంప్‌ను ధిక్కరిస్తున్నాయి. మరొకవైపు అమెరికా ఆర్థికపరిస్థితి క్రమంగా బలహీనపడుతూ, రుణభారం 36 ట్రిలియన్ డాలర్లను మించి దేశజిడిపినే దాటిపోయింది. ఈ స్థితి అమెరికా ఆర్థికవేత్తలకు ఆందోళన కలిగిస్తున్నది.
ఇన్నిన్ని చెప్పుకున్న తర్వాత తేలుతున్న ప్రశ్న, ఇటువంటి స్థితిలో ఉన్న అమెరికా, తనను తాను నిలబెట్టుకునేందుకు ప్రపంచాన్ని ఒక బందీగా మార్చుకోవాలని ప్రయత్నించవచ్చుగాక. కాని ఒక స్థాయి ఆధిపత్యాన్ని మించి అట్లా బందీగా మారవలసిన అగత్యం ప్రపంచానికి ఉందా? ఎంతమాత్రం లేదు. అమెరికాకు గల బలాలు క్రమంగా తగ్గుతున్నా, అది ఇంకా శక్తివంతమైన దేశమే. ప్రపంచ దేశాలు పలువిధాలుగా వారిపై ఆధారపడక తప్పని స్థితి ఇంకా ఉంది. అది గాక అంతర్జాతీయ చట్టాలతో నిమిత్తం లేకుండా కేవలం తమ సైనిక బలప్రయోగంతో ఇతరులను లొంగదీసుకునే చర్యలు కనిపిస్తున్నవే. ఇవెంత నిజమో, తక్కిన ప్రపంచం తన మార్గంలో తాను అభివృద్ధి చెందుతూ వీలైనన్ని విధాలుగా స్వతంత్ర ధోరణులలోకి మారుతుండటం కూడా అంతే నిజం.
ప్రపంచానికి ఇది ఒక పరివర్తనా దశ. లేదా సంధి కాలం. గతంలోని అనేక సామ్రాజ్యాలవలెనే, అమెరికన్ సామ్రాజ్యం కూడా శిధిలమై పతనమయే దశలోకి అడుగుపెడుతున్నది. ఆ పతనం ఇప్పటికిప్పుడు జరుగుతుందని కాదు. ఎప్పటికి జరిగేదీ జోస్యం చెప్పలేము. ఆ దశ మొదలైందన్నది మాత్రం ఎదురుగా కనిపిస్తున్న వాస్తవం. ఈ దశకు ఒక ప్రధాన కారణం అమెరికా అంతర్గత బలహీనతలు, ఒత్తిడులు, కోల్పోతున్న ఆధిక్యతలు. రెండవ ప్రధాన కారణం తక్కిన ప్రపంచం తన స్థాయిలో తాను క్రమంగా బలపడుతుండటం, స్వతంత్ర ధోరణులను అవలంబిస్తుండటం. గతంలో ప్రతి సామ్రాజ్య పతనం కూడా ఇదే మార్గంలో జరిగింది. అమెరికా అందుకు మినహాయింపు కాబోదు. ఆ సూచనలు పైన పేర్కొన్న విధంగా ఎదురుగా ఉన్నవే. అందువల్ల అమెరికాకు ప్రపంచం బందీ అయి తీరవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ సందర్భంలో భారతదేశం గ్రహించవలసింది చాలానే ఉంది.
ఈ దేశంలో 1947 లో స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత గత సుమారు 80 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంత అభివృద్ధి సాధించవలసి ఉండెనో అంత సాధించలేదు. అదే సమయంలో ఇక్కడి సహజ వనరులు, ప్రజల శక్తియుక్తులు అపారమైనవి. వాటిని సక్రమంగా వినియోగించగలిగితే ఎవరికీ తీసిపోని విధంగా అభివృద్ధి చెందటం ఎంత సాధ్యమో, అమెరికా సహా ఎవరికీ బందీ కానక్కరలేని విధంగా స్వతంత్రంగా నిలబడటం కూడా అంతే సాధ్యం. ప్రధాని మోడీ అధికారానికి వచ్చినప్పడు, విదేశాంగ విధానం అందరికీ సమదూరంలో, అందరితో మైత్రీపూర్వకంగా, అందరి తోడ్పాటు తీసుకుంటూ సాగగలదని ప్రకటించారు. అది సరైనదని వేరే చెప్పనక్కర లేదు. కాని ఆచరణలో అమెరికానుంచి తరచూ చిక్కులు ఎదురవుతుండటం కనిపిస్తున్నదే. అమెరికాకు తన వ్యూహాలు తనకుంటాయి. ఇండియా వ్యూహం మాత్రం ఎవరికీ బందీ కాకుండా ఉండాలి.
- టంకశాల అశోక్ ( దూరదృష్టి)
- రచయిత సీనియర్ సంపాదకులు














