
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాలో పోషించిన పాత్రకు తాను సూట్ అవ్వలేదేమోనని అనిపించిందని ఆమె చెప్పడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా..
ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను పొందలేకపోయింది. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్‌కు ఆ కథ, పాత్రలు అంతగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సినిమాకు ఓకే చెప్పడానికి కారణాల గురించి మాట్లాడిన సాయి పల్లవి.. “ఆ సమయంలో నేను వరుసగా భావోద్వేగాలకు సంబంధించిన సినిమాల్లో నటిస్తున్నా. అందుకే మనసుకు హాయిగా అనిపించే కథ చేయాలని అనిపించింది. ఏక్ దిన్ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ సన్ రైజ్ సినిమా గుర్తొచ్చింది. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే చెప్పా’‘ అని తెలిపారు.














