
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ రాజ్యసభ పక్షాన్ని బిజెపిలో విలీనం చేస్తున్నామని రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు జరిగిందని, మూడింట రెండొంతుల మంది బిజెపిలో చేరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారని, పదిమందిలో ఏడుగురు బిజెపిలో చేరామని రాఘవ్ చద్దా తెలియజేశారు. హర్భజన్ సింగ్, స్వాతి మాలీవాల్, రాజేంద్ర గుప్తా, విక్రం సహానీ కూడా తమతో ఉన్నారని అన్నారు. ఉదయమే ఏడుగురు సభ్యులం వెళ్లి రాజ్యసభ ఛైర్మన్ ను కలిశామని, విలీనపత్రాలపై సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మన్ కు అందించామని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ..తన సిద్ధాంతాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రస్తుతం ఆప్ ప్రజల కోసం పనిచేయట్లేదని, ప్రస్తుతం ఆప్ ను వ్యక్తిగత లాభాల కోసమే నడుపుతున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం అవినీతి పరుల చేతుల్లో ఉందని, ఆప్ నేరాల్లో తాను భాగస్వామిని కాదలుచుకోలేదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.











