
ప్రాంతీయ పార్టీల ఉత్థాన పతనాలు! చిన్న పార్టీల పెద్ద ఆశలు.. కానీ నిలకడలో వెనుకబాటు కనిపిస్తుంది. ఒక్క ఎన్నికే నిర్ణయంగా గెలిస్తే గద్దె... లేకపోతే గల్లంతు! అనే పరిస్థితి కూడా ఉంది. మెజారిటీ పార్టీలు మనుగడ కోసం పెద్ద పార్టీల్లో కలిసిపోతున్నాయి. సిద్ధాంతం కంటే వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల నేత వెనుకబడితే పార్టీ కనుమరుగవుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం, కేవలం ఎన్నికల ముందే హడావుడి చేయడం కూడా పలు సందర్భాలలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ ఏ నినాదంతో వస్తుంది? అది ప్రజల ఆశలను ప్రతిబింబిస్తుందా లేక కేవలం రాజకీయ రక్షణ వేదికగా మారుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. తెలుగు రాజకీయ చరిత్రను గమనిస్తే.. ‘ప్రజల నమ్మకమే పార్టీకి ప్రాణం.. అది కోల్పోతే ఎంతటి వారైనా చరిత్ర పుటల్లో పేర్లుగా మిగలడం అనివార్యం.’
తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం ఎప్పుడూ ఆసక్తికరమే. సిద్ధాంతాల కంటే సంచలనాలకే ఇక్కడ పెద్దపీట. పవర్కోసం పుట్టి.. విలీనాల్లో ముగిసిన పార్టీల కథలు తెలుసుకోవాల్సిందే. తాజాగా జాగృతి నేత, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న మేడ్చల్ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారనే వార్తలతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ‘ప్రాంతీయ పార్టీల’ ప్రస్థానంపై చర్చ మొదలైంది. ఉమ్మడి ఎపినుంచి నేటి విభజిత రాష్ట్రాల వరకు తెలుగు రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టాయి, కొన్ని చరిత్ర సృష్టించాయి, మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి గమనిస్తే ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలి. తెలుగు రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పేరు తెలుగుదేశం.1982లో నందమూరి తారకరామారావు స్థాపించిన ఈ పార్టీ కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని రికార్డు సృష్టించింది. ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా ‘తెలుగువారి ఆత్మగౌరవం’ నినాదంతో పుట్టిన ఈ పార్టీ, నాలుగు దశాబ్దాల తర్వాత కూడా నేడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠంపై ఉండి తన ఉనికిని చాటుకుంటోంది.
మరోవైపు, రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి. రంగా స్థాపించిన కషికార్ లోక్ పార్టీ, రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ ఒకప్పుడు ఉమ్మడి ఎపిలో బలమైన ముద్రవేసినప్పటికీ, కాలక్రమేణా పెద్ద పార్టీల్లో విలీనమై అంతర్థానమయ్యాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి 1971 లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 10 గెలిచి ప్రభంజనం సృష్టించినా, చివరకు కాంగ్రెస్‌లో విలీనమై ఒక అధ్యాయాన్ని ముగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 ఆగస్టు 26న తిరుపతిలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం 18% ఓట్లు సాధించినా రెండేళ్లకే కాంగ్రెస్‌లో విలీనమైంది. మాజీ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర, వి.వి. లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ వంటివి ఓటర్లను ఆకట్టుకోవడంలో వెనుకబడ్డాయి. రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఈ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మెజారిటీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ దెబ్బతిన్నది. తర్వాత ఆయన బిజెపిలో చేరిపోయారు. ఎన్టిఆర్ మరణానంతరం లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్టిఆర్ టిడిపి, నందమూరి హరికృష్ణ స్థాపించిన అన్నా టిడిపి కూడా వారసత్వ పోరులో నిలబడలేకపోయాయి. ఐఎఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ 2006లో రాజకీయ సంస్కరణల కోసం స్థాపించిన లోక్ సత్తా పార్టీ కూకట్పల్లి నుంచి ఒక సీటు గెలిచినప్పటికీ, కాలక్రమేణా ఎన్నికల రాజకీయాలకు దూరమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ వివిధ ప్రజాసంబంధ అంశాలపై ఆ పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ పోరాటాలు సాగిస్తున్నారు. ఇక సంచలనాల కె.ఎ.పాల్ 2008లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ ప్రజాశాంతి పేరిట ప్రాంతీయ పార్టీని స్థాపించారు. 2009లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని స్థానాల్లో పోటీ చేసినా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేకపోయింది.
తర్వాత 2019 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. పాల్ స్వయంగా నరసాపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కేవలం 3,046 ఓట్లు (0.3%) మాత్రమే సాధించారు. 2024లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసినప్పటికీ, కేవలం 7,529 ఓట్లు మాత్రమే పొంది ఓటమి పాలయ్యారు. ఈ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. తెలంగాణ సాధన సమితి పేరిట ఆలే నరేంద్ర స్థాపించిన ఈ పార్టీ తర్వాత టిఆర్ఎస్ (ప్రస్తుతం బిఆర్ఎస్)లో విలీనమైంది. అలాగే తల్లి తెలంగాణ పార్టీ పేరిట ప్రస్తుత కాంగ్రెస్ ఎంఎల్‌సి, నటి విజయశాంతి స్థాపించిన ఈ పార్టీ కూడా తర్వాత టిఆర్ఎస్లో విలీనమైపోయింది. అయితే ఈ రెండు పార్టీలను తమ పార్టీలో చేర్చుకునేంతవరకు ఆదరించిన కెసిఆర్ తర్వాత నరేంద్ర, విజయశాంతికి మొండిచేయి చూపడమేగాక వారు పార్టీ నుంచి వెళ్లిపోయేలా వ్యవహరించారన్న విషయం ప్రచారంలో ఉంది. అటువంటి కెసిఆర్ పార్టీని వ్యతిరేకిస్తూ ఇప్పుడు స్వయంగా ఆయన కూతురు కవిత వేరుకుంపటి పెట్టడం చర్చనీయమైంది. గతంలో జై తెలంగాణ పార్టీ పేరిట పి. ఇంద్రారెడ్డి స్థాపించిన పార్టీ ఆయన మరణం తర్వాత ఉనికిని కోల్పోయింది.
ఆయన సతీమణి కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి తర్వాత కాలంలో కెసిఆర్ పంచన చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన పార్టీ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ యుద్ధం, సినీ గ్లామర్ రెండు ప్రధాన పార్టీలకు జన్మనిచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు చేసి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీగా అత్యంత వేగంగా అధికారంలోకి వచ్చింది.. రాజశేఖర్‌రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకుని 2019లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే శివ కుమార్ అనే వ్యక్తి 2010 -11 ప్రాంతంలోనే ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారు. జగన్ మోహన్‌రెడ్డి తన పార్టీకి ఇదే పేరును వాడుతుండటంతో, శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదేనని, జగన్ తన పేరును అక్రమంగా వాడుకుంటున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు.
జగన్ పార్టీని తన పార్టీలో విలీనం చేయాలని లేదా జగన్ కొత్త పేరు పెట్టుకోవాలని ఆయన వాదించారు. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే, జగన్ మోహన్‌రెడ్డి వర్గం శివకుమార్‌తో చర్చలు జరిపింది. చివరకు శివకుమార్ తన పార్టీని జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అంగీకరించారు. దీనితో సాంకేతికంగా శివ కుమార్ స్థాపించిన పార్టీయే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కొనసాగింది. ఈ విలీనం తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం జగన్ మోహన్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా గుర్తిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ‘ఫ్యాన్’ గుర్తును కేటాయించింది.
మరోవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ‘వైఎస్ఆర్’ అంటే ‘యువజన శ్రామిక రైతు’ కాంగ్రెస్ పార్టీ అని అర్థం. అయితే, దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫోటో, పేరును వాడుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ జగన్ తన పార్టీ పేరులో వైఎస్ఆర్ అంటే ‘యువజన శ్రామిక రైతు’ అని స్పష్టం చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సుదీర్ఘ పోరాటం తర్వాత 2024లో ఎపి ప్రభుత్వంలో భాగస్వామిగా మారి కీలక శక్తిగా ఎదిగింది. 2014, మార్చి 14న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఈ పార్టీని ప్రకటించారు. పార్టీ స్థాపించిన వెంటనే వచ్చిన 2014 ఎన్నికల్లో జనసేన నేరుగా పోటీ చేయలేదు. ‘రాష్ట్ర విభజన’ నేపథ్యంలో అనుభవం ఉన్న నాయకత్వం కావాలని భావించి టిడిపి -బిజెపి కూటమికి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కూటమి విజయంలో జనసేన కీలక పాత్ర పోషించింది. 2019లో జనసేన తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగింది. వామపక్షాలు, బిఎస్పితో కలిసి కూటమిగా పోటీ చేసింది.
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన 137 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 1 స్థానంలో (రాజోలు -రాపాక వరప్రసాద్- తర్వాత ఆయన వైసిపి తీర్థం పుచ్చుకున్నారు) మాత్రమే విజయం సాధించింది.18 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం సీట్లనుంచి పోటీ చేసి, స్వల్ప తేడాతో రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపి, బిజెపిలతో కలిసి ‘మహాకూటమి’గా పోటీ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ ఈ పొత్తుకు చొరవ తీసుకున్నారు. కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన 21కి 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించి, 100% స్రె్టైక్ రేట్ నమోదు చేసింది. పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాకినాడ, మచిలీపట్నం ఎంపి సీట్లలో పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించింది.
తెలంగాణ రాష్ర్టం విషయానికొస్తే.. ఉద్యమ గడ్డపై ‘గులాబీ’ ప్రస్థానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణే లక్ష్యంగా 2001లో కెసిఆర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బిఆర్ఎస్) రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లపాటు తిరుగులేని పాలన సాగించింది. జాతీయ ఆకాంక్షతో 2022లో బిఆర్ఎస్గా రూపాంతరం చెందినా, 2023 ఎన్నికల తర్వాత ప్రస్తుతం రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్షంగా తన ఉనికిని కాపాడుకునే పోరాటంలో ఉంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే లక్ష్యంతో, పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తన ప్రాంతీయ పార్టీ పేరును 2022, అక్టోబరు 5 దసరా పండుగ రోజున మార్చారు. కేంద్ర ఎన్నికల సంఘం 2022, డిసెంబరు 8న ఈ పేరు మార్పును అధికారికంగా ఆమోదించింది. ఈ పార్టీ జాతీయ స్థాయిలో ఎదగడానికి ఇతర రాష్ట్రాల్లో కూడా తన శాఖలను ప్రారంభించింది. 2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిట్‌ను ప్రారంభించారు.
దీనికి అధ్యక్షుడిగా మాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. అదే విధంగా అత్యధికంగా మహారాష్ట్రపై దృష్టి సారించి అక్కడ అనేక బహిరంగ సభలు నిర్వహించి, స్థానిక నేతలను పార్టీలో చేర్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ వంటి కీలక నేతలు చేరారు. జాతీయ కార్యకలాపాల కోసం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనూహ్యంగా 2023 అసెంబ్లీ తర్వాత పార్లమెంటు, ఆపై అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ర్టంలోని అధికార కాంగ్రెస్, కేంద్రంలోని అధికార బిజెపి నుంచి గట్టి దెబ్బలు తగిలిన తర్వాత పార్టీ తన జాతీయ విస్తరణ వేగాన్ని తగ్గించి, ప్రస్తుతం రాష్ట్రస్థాయి రాజకీయాలపై ఎక్కువ దష్టి సారిస్తోంది. తెలంగాణలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తన అన్న జగన్‌తో విభేదించాక వైఎస్ఆర్ టిపి పేరిట పార్టీని స్థాపించి పాదయాత్రలు చేసినా, చివరకు 2024లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇక హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా ఎఐఎంఐఎం తన బలాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది
కమ్యూనిస్టుల ప్రస్థానం.. మతపరమైన సమీకరణలు: 1946 నాటి సాయుధ పోరాటం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నప్పటికీ, 1964లో సిపిఐ, సిపిఐ (ఎవ్‌ు)గా చీలిపోవడం వారిని బలహీనపరిచింది. ప్రస్తుతం ఈ పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మరోవైపు, హిందూత్వ సిద్ధాంతంతో బిజెపి రెండు రాష్ట్రాల్లోనూ బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. తెలంగాణలో అద్వితీయ శక్తిగా ఎదుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 స్థానాలు గెలవడం దీనికి నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 200లకు పైగా చిన్న పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నా, నిలబడలేకపోవడానికి పలు ప్రధాన కారణాలున్నాయి. వీటిలో హిట్ అయ్యినవి కొన్ని... హిస్టరీ అయినవి మరెన్నో! చిన్న పార్టీల పెద్ద ఆశలు.. కానీ నిలకడలో వెనుకబాటు కనిపిస్తుంది.
ఒక్క ఎన్నికే నిర్ణయంగా గెలిస్తే గద్దె... లేకపోతే గల్లంతు! అనే పరిస్థితి కూడా ఉంది. మెజారిటీ పార్టీలు మనుగడ కోసం పెద్ద పార్టీల్లో కలిసిపోతున్నాయి. సిద్ధాంతం కంటే వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల నేత వెనుకబడితే పార్టీ కనుమరుగవుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం, కేవలం ఎన్నికల ముందే హడావుడి చేయడం కూడా పలు సందర్భాలలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ ఏ నినాదంతో వస్తుంది? అది ప్రజల ఆశలను ప్రతిబింబిస్తుందా లేక కేవలం రాజకీయ రక్షణ వేదికగా మారుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. తెలుగు రాజకీయ చరిత్రను గమనిస్తే.. ‘ప్రజల నమ్మకమే పార్టీకి ప్రాణం.. అది కోల్పోతే ఎంతటి వారైనా చరిత్ర పుటల్లో పేర్లుగా మిగలడం అనివార్యం.’
- దిమిలి అచ్యుతరావు
93951 50036











