
తమిళనాడు రాజకీయాల్లో సినీనటుడు విజయ్ ప్రవేశం కొత్త ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, ఓటర్ల అభిప్రాయం మాత్రం ఏకపక్షంగా లేదు. పట్టణాల్లో యువతలో కొంత ఉత్సాహం కనిపిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జాగ్రత్తగా చూసే ధోరణి ఉంది. స్టార్ పవర్ కంటే పాలన అనుభవం ముఖ్యమని చాలా మంది భావిస్తున్నారు. విజయ్ సినిమాలు మాకు చాలా ఇష్టం.కానీ రాష్ట్రాన్ని నడపడం సినిమా కథలా కాదు. ఆయన చెప్పేవిధానాలు ఏమిటో ముందుగా చూడాలి. - చెన్నైలో ఓ యువ ఓటరు కొత్త వాళ్లు రావడం మంచిదే. కానీ మా సమస్యలు - వ్యవసాయం, ఉపాధి -ఇవి ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. అప్పుడే మేము నమ్ముతాం. తిరుచిరాపల్లి జిల్లాలో ఓ రైతు. రాజకీయాల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఓ నాయకుడు అధికారంలోకి రాకపోయినా, అధికారాన్ని ఎవరికిస్తాడో నిర్ణయించే స్థాయికి చేరుకుంటాడు. తమిళనాడు రాజకీయాల్లో 2026 ఎన్నికలు అలాంటి మలుపు వద్ద నిలిచాయి. సినీనటుడు విజయ్ ప్రవేశం ఈ ఎన్నికలను సాధారణ పోటీ నుంచి ఒక రాజకీయ ప్రయోగంగా మార్చింది.
దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు రెండు ప్రధాన శక్తుల చుట్టూ తిరిగాయి. ఒక వైపు అధికారంలో ఉన్న డిఎంకె, మరో వైపు అధికారాన్ని కోల్పోయిన కానీ ఇంకా ప్రాతిపదిక ఉన్న ఎఐఎడిఎంకె. కానీ ఇప్పుడు ఈ సమీకరణంలో మూడోశక్తిగా విజయ్ పార్టీ ప్రవేశించడం రాజకీయ సమీకరణాలను కుదిపేసింది. విజయ్‌కు ఉన్న ప్రజాదరణ అనేది సందేహానికి తావులేని విషయం. ముఖ్యంగా యువతలో అతని ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. అతని సభలకు వచ్చే జనసందోహం, సోషల్ మీడియా హడావిడి ఇవన్నీ ఒక కొత్త రాజకీయ అలగా కనిపిస్తున్నాయి. కానీ రాజకీయ చరిత్ర ఒక నిజాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది: జన సమూహం ఓట్లుగా మారాల్సిందే గాని, ప్రతి చప్పట్లు ఓటుగా మారవు. ఈ నేపథ్యంలో కీలకమైన ప్రశ్న విజయ్ ఎవరిని గెలిపిస్తాడు? ఎందుకంటే, అతను గెలుస్తాడా అన్నది కంటే ఇది ఎక్కువ ప్రాముఖ్యం పొందింది. విజయ్ పార్టీ పోటీ చేయడంవల్ల ఓట్ల చీలిక అనివార్యం. ఈ చీలిక ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే, యాంటీ-ఇంకంబెన్సీ ఓటు, ప్రత్యామ్నాయంకోసం ఎదురుచూస్తున్న వర్గం విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ వర్గం సంప్రదాయంగా ఎఐఎడిఎంకెకు మద్దతు ఇస్తూ వచ్చింది. అలాంటి ఓట్లు విడిపోతే, అది ఎఐఎడిఎంకెకు గట్టి దెబ్బగా మారుతుంది. ఇక అధికార పార్టీ డిఎంకె విషయానికి వస్తే, దాని బలమైన కేడర్, సంక్షేమ పథకాల ప్రభావం, నాయకత్వ స్థిరత్వం ఇవన్నీ కలిసి దానికి ఒక ఆధిక్యాన్ని ఇస్తున్నాయి. విజయ్ ప్రభావం డిఎంకె ఓటు బ్యాంకును పూర్తిగా దెబ్బతీయగలదా అంటే, అది సందేహాస్పదం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. విజయ్ గెలిచే అవకాశాలపై మాట్లాడితే అతని పార్టీకి గణనీయమైన ఓటు శాతం రావచ్చు.
కానీ అది సీట్లుగా మారడం సులభం కాదు. కారణం స్పష్టమే: గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టంగా లేకపోవడం, అనుభవం కొరత, మిత్రపక్షాల లేమి. రాజకీయాల్లో ఓటు శాతం కంటే, ఆ ఓటు సరైన చోట కేంద్రీకృతం కావడం ముఖ్యం. అందుకే ఈ ఎన్నికల్లో విజయ్ పాత్రను ఒక కొత్త కోణంలో చూడాలి. అతను కింగ్ కాకపోవచ్చు. కానీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఎందుకంటే, ఇది ద్వైపాక్షిక రాజకీయ వ్యవస్థకు ముగింపు పలికే సంకేతం కావచ్చు. ఇకపై రాష్ట్రంలో మూడో శక్తి స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ఈసారి అధికారాన్ని అందుకోకపోవచ్చు... కానీ అధికారాన్ని ఎవరు అందుకుంటారో చెప్పే స్థాయికి చేరుకున్నాడు.
- శ్యాంమోహన్
(సీనియర్ జర్నలిస్ట్)














