దేశంలోని అనేక కర్మాగారాల్లో పనికి వెళ్లడం అనేది ఒక యుద్ధానికి వెళ్లినట్టుగా, తమ ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఈ పరిస్థితి ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. తయారీ రంగం వృద్ధి చెందుతున్నప్పటికీ, కార్మికుల భద్రత, పని పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. అసంఘటిత రంగంలో 90 శాతం పైగా కార్మికులు భద్రతా పరిధిలో లేరని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది కార్మికులు రోజుకు 12 నుంచి 14 గంటలపాటు పనిచేయవలసి వస్తోంది. 70 గంటల పనివారం వంటి ప్రతిపాదనలు ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. అంచనాల ప్రకారం దేశంలో రోజుకు సుమారు ముగ్గురు ఫ్యాక్టరీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరో 11మంది తీవ్రగాయాల పాలవుతున్నారు. గత వారంలో మూడు ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించి 60 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు.

ఇటువంటి వార్తలు ఏ సున్నితమైన దేశాన్నయినా, ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు సరిదిద్దుకునేలా హెచ్చరిస్తాయి. 1976 జులై 10న సెలెసో సమీపంలోని ఐసిఎంఇఎన్‌ఎ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు వల్ల ప్రజలు అత్యంత విషపూరిత డయాక్సిన్‌కు గురయ్యారు. ఈ విపత్తు తర్వాత పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టేందుకు పర్యావరణ పరిరక్షణకు కఠినమైన నిబంధనలతో ‘సెవెసో డైరెక్టర్’ను 1982లో యూరప్ దేశాల యూనియన్ అమలులోకి తెచ్చింది. ఈ సంఘటన పారిశ్రామిక భద్రతలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. 2019 2022 మధ్యకాలంలో యూరప్ యూనియన్ దేశాల్లో ఏడాదికి 22 వంతున పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి. కొరియాలో లిథియం బ్యాటరీ మేకర్ ఎయిర్‌సెల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 23మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఈ ప్రమాదానికి బాధ్యుడ్ని చేస్తూ ఆ సంస్థ సిఇఒకు నిన్న నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంఘటన గమనార్హం. కానీ మనదేశంలో ఫ్యాక్టరీ ప్రమాదాల గురించి ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఒకవిధంగా ఈ ప్రమాదాలు సర్వసాధారణమే అన్నట్టు మనం మొద్దుబారిపోయాం. గతవారం వేదాంత బాయిలర్ పేలుడు, ఈ వారం తమిళనాడు, కేరళ బాణాసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు జరిగాయి. అయితే అవి బస్సుల దహనాలు, రోడ్డు ప్రమాదాల కన్నా ఎక్కువేం కాదు. బస్సుల ప్రమాదాలు ఏడాదికి వందలాది మందిని బలిగొంటుండగా, రోడ్డు ప్రమాదాలు ఏటా లక్షాఎనభై వేలమంది ప్రాణాలు తీస్తున్నాయి. తమిళనాడు లోని ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 17మంది మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి మరువక ముందే కేరళ లోని త్రిసూర్ జిల్లాలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి 13 మంది కార్మికులు అక్కడికక్కడే మంటల్లో బూడిదయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ కూడా కొన్ని పరిశ్రమల ప్రమాదాలకు ప్రత్యక్షసాక్షిగా నిలబడుతోంది. 2019లో ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి 43 మంది స్లీపింగ్ వర్కర్లను పొట్టనపెట్టుకుంది.

మన కళ్లల్లో జీవితం చాలా తృణప్రాయం. అందుకనే ఫ్యాక్టరీల్లో ఫైర్ ఎగ్జిట్స్ ఉండడం లేదు. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఓవర్‌లోడ్ అవుతుంటాయి. బాయిలర్ల నిర్వహణ చాలా అధ్వానం. ఇవన్నీ మనకు నిత్యం ప్రత్యక్ష సాక్షాలే. భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదకరమైన రసాయనాలను నిల్వ చేస్తుంటారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తీవ్ర పరిణామాలు మనకు తెలిసిందే. 1984 డిసెంబర్ 23 తేదీల్లో భోపాల్ లోని యూనియన్ కార్బయిడ్ పురుగు మందుల కర్మాగారం నుండి మిథైల్ ఐసోసైనెట్ అనే విషవాయువు లీకై వేలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంటిచూపు కోల్పోవడం, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో దాదాపు 5 లక్షల మంది బాధితులయ్యారు. ఇది ప్రపంచం లోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణించబడుతోంది. 2020 లో ప్రతి 973 ఫ్యాక్టరీలకు ఒకే ఒక ఇన్‌స్పెక్టర్ ఉండేవారంటే ఫ్యాక్టరీల తనిఖీ ఎలా జరుగుతుందో దీన్ని బట్టి తెలుస్తుంది. దేశ రాజధాని ఆటో అనుబంధ పరిశ్రమల ప్రమాదాలకు పేరు పొందింది.

ఈ పరిశ్రమల్లో వర్కర్లకు ఎప్పుడు కాళ్లు, చేతులు తెగిపోవడం, గాయాలవ్వడం పరిపాటి. అయినా ఈ వివరాలేవీ రికార్డుకెక్కవు. తనిఖీలు జరిగేటప్పుడు ఈ చిన్నపాటి ప్రమాదాలు తక్కువగానే జరిగినట్టు రికార్డులు చూపిస్తుంటారు. 2012 నుంచి 2020 వరకు తనిఖీల్లో చాలా తక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరిగినట్టు ఆయా యాజమాన్యాలు అధికారులకు రికార్డులు చూపించడం గమనార్హం. ప్రమాదాల వివరాలను దాచిపెట్టడం లేదా బయటపెట్టడానికి ఒప్పుకోకపోవడం చేసినంత కాలం ఫ్యాక్టరీల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించదు. 2017లో ఒక అధ్యయనం ప్రకారం దేశంలో వృత్తిపరమైన ప్రమాదాలు ఏటా 48,000 వరకు జరుగుతున్నాయని తేలింది. ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్య కేవలం 1109 మాత్రమే అని చూపించింది.

ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల్లో 90 శాతం మంది అసంఘటిత కార్మికులే ఉన్నారని చెప్పవచ్చు. పని పరిస్థితుల సంగతి ఇక చెప్పలేం. అధికారిక రంగ కార్మికుల విషయంలో కూడా చాలా ప్రమాదాలను పరిశ్రమల యాజమాన్యాలు సరిగ్గా నమోదు చేయడం లేదు సరికదా ఏదైనా ప్రమాదం జరిగితే పోలీసులు, ఆస్పత్రి వర్గాలు రాజీధోరణి అవలంబించడమే ప్రధాన లక్షంగా వ్యవహరిస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఒ) కార్మికుల పాలిట మనదేశం ప్రమాదకరమైన దేశమని ముద్ర వేసింది. ఇకనైనా ఈ అపకీర్తి తుడిచిపెట్టడానికి ఏదో ఒకటి చేయాల్సి ఉంది.