
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్‌లో 9వ స్థానానికి పరిమితమైంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో విజయానికి మార్గం సులభంగా ఉన్నా.. దాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో మూడు బంతులు ఎదురుకొని డకౌట్ అయ్యాడు.
దీంతో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో ధోనీ(6) రికార్డను పంత్ దాటేశాడు. నిన్నటి దానితో కలిపి పంత్ మొత్తంగా 7 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో గిల్‌క్రిస్ట్‌తో కలిపి సంయుక్తంగా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. డక్ మాస్టర్ల జాబితాలో దినేశ్ కార్తిక్(16), పార్థివ్ పటేల్ (10), నమన్ ఓఝా(8) టాప్-3లో ఉన్నారు.
ఇక నిన్నటి మ్యాచ్‌లో లక్నో బౌలింగ్‌లో శభాష్ అనిపించింది. ఆర్ఆర్‌ను కేవలం 159 పరుగులకే కట్టడి చేసింది. కానీ, ఈ స్వల్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం విఫలమైంది. ఆర్చర్ (3 వికెట్లు), బర్గర్ (2 వికెట్లు), బ్రిజేశ్ శర్మ (2 వికెట్లు), జడేజా, బిష్ణోయ్ తలో వికెట్ తీయడంతో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది.













