చిట్టగాంగ్: న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో కైవసం చేసుకుం ది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (0), తన్‌జిద్ హసన్ (1) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన సౌమ్య సర్కార్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఈ దశలో నజ్ముల్ హుస్సేన్ శాంటో, వికెట్ కీపర్ లిటన్ దాస్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ తరచు బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. శాంటో,దాస్‌లు కలిసి నాలుగో వికెట్‌కు వేగంగా 160 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన లిటన్ దాస్ 76 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు శాంటో 9 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 105 పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ (33), కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (22) పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 44.5 ఓవర్లలో 210 పరుగులకే కుప్పకూలింది. నిక్ (59), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (75)లు మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రహ్మాన్ ఐదు వికెట్లు తీశాడు. నాహిద్, మెహదీ హసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.