భారత్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళా టీమ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 30తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు 16.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు లౌరా వాల్‌వర్డ్, సునే లూస్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన లౌరా 53 బంతుల్లోనే 14 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 115 పరుగులు చేసింది.

ఈ క్రమంలో తొలి వికెట్‌కు 183 పరుగులు నమోదు చేసింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన లూస్ 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు మెరుగైన ఆరంభాన్ని అందించారు. ధాటిగా ఆడిన మంధాన 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ 8 బౌండరీలు, రెండు సిక్స్‌లతో 64 పరుగులు సాధించింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హర్మన్ 38 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసింది. రిచా ఘోష్ 18 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించింది.