ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ‘వేదవ్యాస్’ చిత్రం బ్యానర్ ఆవిష్కరణ ఫిలిం నగర్ లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ శాసనసభ్యులు, వ్యాపారవేత్త అయిన కొమ్మూరి ప్రతాపరెడ్డి తమ బ్యానర్‌కు ‘సాయి ప్రగతి ఫిలిమ్స్’ అని నామకరణం చేసుకొని చిత్ర దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకులు అచ్చిరెడ్డిలతో కలిసి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్యానర్‌ను ఆవిష్కరించారు. సకుటుంబ సమేత కథాంశంతో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వేదవ్యాస్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ ‘వేద వ్యాస్’ చిత్రం ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్ సెగ్మెంట్ ను తెలుగు తెరకు పరిచయం చేయటం విశేషం. ఇంకా ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్, బాబు మోహన్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్, రఘు బాబు, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.