
అమరావతి: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తుండగా ప్రియుడితో కలిసి అతడిని చంపాలనుకొని ప్లాన్ వేశారు. ఓ రౌడీ షీటర్ తో చంపిస్తుండగా భర్త తప్పించుకొని పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లింగాపురం గ్రామంలో ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. జమ్మలమడుగుకు చెందిన దాసరిగాళ్ల నాగసుధీర్ తో శిల్పారెడ్డికి పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి అతడిని చంపాలని భార్య నిర్ణయం తీసుకుంది. శిల్పారెడ్డి దగ్గర ఉన్న బంగారు నగలు అమ్మి వినయ్ అనే రౌడీషీటర్ కు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. మర్డర్ చేసిన తరువాత మిగిలిన డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.
భర్త ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రౌడీషీటర్ వినయ్ కు సమాచారం ఇచ్చారు. కారుతో బైక్ ను ఢీకొట్టారు. ఈశ్వర్ రెడ్డిని కత్తులతో చంపడానికి ప్రయత్నిస్తుండగా అక్కడి నుంచి తప్పించుకొని పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. శిల్పారెడ్డి, నాగసుధీర్, రౌడీ షీటర్ వినయ్ తో పాటు మరి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.










