
ఆధునిక ప్రపంచంలో పర్యావరణ స్పృహ, చేతన మొదలై 56 సంవత్సరాలు. రాచెల్ కార్సన్ పుస్తకం ‘ది సైలెంట్ స్ప్రింగ్’ సంచలనం సృష్టించింది. మానవ చర్యలు, ప్రమేయాలవల్ల వాతావరణ కాలుష్యాలతో ప్రకృతి సమతుల్యత నాశనమై పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందనే చేతన అప్పుడప్పుడే మొదలైంది. కాలుష్యాలవల్ల జరుగుతున్న హాని, చేపట్టవలసిన సత్వర చర్యల అవసరం- అవగాహనను రాజకీయ ఎజెండా మీదికి తీసుకురావాలని అమెరికా సెనెటర్ గెలార్డ్ నెల్సన్ చేసిన ప్రయత్నమే ‘ధాత్రి దినోత్సవం’ (22 ఏప్రిల్ 1970) పుట్టుకకు కారణం. యుద్ధ వ్యతిరేకోద్యమం, జ్వాలలు రేపుతున్న నాటి యువశక్తి ప్రభావాన్ని గుర్తించి, దాన్ని పర్యావరణ చేతన వైపు కూడా మళ్లిస్తే అద్భుత ఫలితాలుంటాయనేది నెల్సన్ ఆనాటి తలంపు. ఆ దృష్టితోనే యువ విద్యార్థి నాయకుడిగా ఉన్న ‘డెన్నిస్ హెయిన్స్’పై దృష్టి పడింది! సదరు యువకున్ని కేంద్రకం చేసి రగిల్చిన అగ్ని- స్వల్ప సమయంలోనే దావాణంలా అంటుకుంది.
సరైన రవాణా- కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ కూడా లేని ఆ రోజుల్లో ఇద్దరే ఇద్దరి కృషి అమెరికా, యూరప్, ఇతర దేశాల్లోని రెండు వందల నగరాలు-పట్టణాల్లో రెండు కోట్ల (20 మిలియన్ల) మందిని కదిలించింది. తొలిసారి ఐక్యరాజ్యసమితి (యుఎన్)లోనూ కదలిక తెచ్చింది. అంతిమంగా అమెరికాలో పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఇపిఎ) ఏర్పాటుకు కారణమైంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఎంతో ప్రేరణ కలిగించింది. అప్పట్నుంచి అవి దీన్నొక కీలకాంశంగా అందుకున్నాయి. యుఎన్ తన బాధ్యత గుర్తెరిగి, 1972 స్టాక్‌హోమ్‌లో ‘ధరిత్రి సదస్సు’ నిర్వహించే స్థితిని కల్పించింది ఈ చేతననే అయిదున్నర దశాబ్దాలనాటి స్ఫూర్తి, చేతన ఇప్పుడు మన దేశంలో అవసరమవుతోంది. ఎందుకంటే, మన రాజకీయ వ్యవస్థ ప్రాధాన్యతల్లో పర్యావరణం, ‘వాతావరణ మార్పు’ల వల్ల ముంచుకొస్తున్న ప్రమాదం వంటి కీలకాంశాలే వెనుకబడిపోతున్నాయి.
యేటా ధరిత్రి దినోత్సవానికి ఒక సంకల్ప అంశం ఇచ్చే ఐక్యరాజ్యసమితి (యుఎన్)ఈసారి 2026కు గాను ‘మన శక్తి-మన ధరిత్రి’ (అవర్ పవర్, అవర్ ప్లానెట్) అని పిలుపునిచ్చింది. అవర్ ‘పవర్’ అంటే, ‘మన రాజకీయ అధికారం’ అనుకున్నారేమో? పాలకులు, ప్రజల సామూహికశక్తి అని గ్రహించినట్టు లేదు. విధానపరంగా ప్రభుత్వాలు, అమలు విస్తృతి-ప్రభావం పరంగా కంపెనీలు, కార్పొరేట్లు, అమలు- ఆచరణలో భాగస్వామ్యంగా ప్రజాసంఘాలు, -పౌరులు పాల్గొనేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సంఘటిత చర్యలే ఉండటం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రకంగా పాలనను అందించాల్సిన తరుణంలో వారిపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా, వారి దీర్ఘకాలక ప్రయోజనాలు లెక్కపెట్టకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశలో పాలకులు పావులు కదుపుతున్నారు.
అంతేతప్ప ‘పర్యావరణ మార్పు’ సమస్య తీవ్రతను గుర్తించడం లేదు. కనీసం ఆ ‘పవర్’ అనే మాటకు విద్యుశ్చక్తి అనే అర్థం తీసుకున్నా, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి పునరుత్పాదక/ పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరాన్ని, అందుకోవాల్సిన వేగాన్ని గుర్తించే వారేమో! పాలుపోని స్థితిలో అదొక ఆశ మాత్రమే! అన్ని సీజన్లూ తీవ్రమై వాతావరణ మార్పులకు గురవుతున్నవే! శీతాకాలంలో మున్నెన్నడు లేనంత చలి జనాన్ని వణికించి చంపుతోంది. వేసవిలో విపరీతమై ఎండలొకవైపు, వర్ష రుతువులో ప్రమాదకర వర్షాలు- వరదలొకవైపు వాతావరణ మార్పులవల్ల తలెత్తుతున్న విపరిణామాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అతివృ ష్టి, అనావృష్టి మన భారత ఉపఖండమ్మీద విపరీతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్, సహజవాయువు, ప్లాస్టిక్ వంటి శిలాజ ఇంధనాల ఇబ్బడిముబ్బడి వినియోగం కర్బనఉద్గారాలను పెంచింది. అలా వచ్చే గ్రీన్‌హౌజ్ గ్యాసెస్ వల్ల భూతాపం అసాధారణంగా పెరిగిపోయింది.
అది ధ్రువాల్లో మంచు కరిగిపోవడానికి కారణమే కాకుండా సముద్ర జలమట్టాలు పెరగటం, చిన్నచిన్న ద్వీపాలు సాగరగర్భంలో కలిసిపోవడం, సముద్ర తీరాల్లోని మహానగరాలు నీటమునిగే ప్రమాదావకాశాలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సముద్రజలాలు వేడెక్కడం, పసిపిక్ సముద్ర ఉపరితలంలో వీచే పెనుగాలుల వేగం తదితర కారణాలవల్ల బలపడ్డ ‘ఎల్‌నినో’ ప్రభావంతో వచ్చే సీజన్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదాన్ని వాతావరణ నిపుణులు శంకిస్తున్నారు. రుతుపవనాల క్రమం కూడా మారుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటాయని, దక్షిణాసియా పైన, మరీ ముఖ్యంగా ద్వీపకల్పమైన భారత్‌పైన ఈ పరిస్థితుల దుష్ప్రభావం అధికంగా ఉంటుందని అంతర్జాతీయ పరిశోధనా నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు -దుష్ప్రభావాలపై అధ్యయనానికి యుఎన్ ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపిసిసి) తాజా నివేదికలు ఇవే విషయాన్ని ధ్రువీకరించాయి.
అసియాలో, ముఖ్యంగా భారత్‌లో ఇది వ్యవసాయం పైన 27 శాతం ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఆహారోత్పత్తిలో 21 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కూడా ఐపిసిసి నివేదిక వెల్లడించింది. అకాల వర్షాలు, ఏడాది వర్షం ఒక పూట కురుస్తున్న తీవ్రత, వాన నీటిని సంరక్షించే వ్యవస్థలు లేక సముద్రం పాలవుతున్న తీరు, వరదలు ముంచెత్తి అపార ప్రాణ- ఆస్తి నష్టాలు కలిగిస్తున్న వైనం, భూగర్భజలాలు అడుగంటిపోతున్న దైన్యం... ఇవన్నీ అరిష్టాలే! అయితే, ఇవి ఒకప్పటిలా పూర్తి ప్రకృతి వైపరీత్యాలు కావు. మానవ తప్పిదాల వల్ల, అసాధారణ, అనుచిత మానవ చర్యల ఫలితంగా తలెత్తుతున్న ప్రమాదాలు. ఏప్రిల్ మధ్య నాటికే తెలంగాణలోని 33కు గాను 24 జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటి, మెజారిటీ జిల్లాల్లో వాతావరణ శాఖ ప్రమాద సంకేతాలు (అలెర్ట్) ప్రకటించాల్సి వచ్చింది. ఇక మే లో పరిస్థితులేంటో? వడగాలి చావులు పెరిగిపోతున్నాయి. అధికారిక, అనధికారిక విద్యుత్ కోతలు నిత్యకృత్యమయ్యాయి.
మనది ఇంధన దిగుమతి ఆర్థిక వ్యవస్థ. దేశం వినియోగించే ఇంధనంలో 80 శాతం బయటి నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే! అమెరికా, ఇజ్రాయిల్ -ఇరాన్ యుద్ధ ప్రభావంతో సరఫరా పాక్షికంగా అస్తవ్యస్తమైతే ఒకటి, రెండు రోజుల్లోనే ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో మనమంతా పెట్రోల్ బంక్‌లు, గ్యాస్‌స్టేషన్లు, ఎల్‌పిజి గోడౌన్ల వద్ద చూశాం. తరిగిపోతున్న, హాని కారకమైన శిలాజ ఇంధనాల వినియోగం నుంచి పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి వైపు శ్రద్ధ, ప్రాధాన్యత పెంచాల్సిన అవసరాన్ని ఆచరణలో చూపడం లేదు. ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్ వినియోగం అత్యున్నత (పీక్) స్థాయికి చేరింది. అధికారిక, అనధికారిక కోతలు మొదలయ్యాయి. బొగ్గు (శిలాజ) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నుంచి సౌర, పవన తదితర పునరుత్పత్తి/ పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లటమే కాదు, వేగంగా పరుగులు తీయాల్సిన సమయంలో భారత్ ఇంకా నత్తనడకన సాగుతోంది. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటూ ఈ విషయంలో ఏయేటి కాయేడు సర్కార్లు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నా, అడుగులు వేగంగా పడటం లేదు.
ఇందుకు అనేక ప్రతిబంధకాలున్నాయి. 2070 నాటికి ‘జీరో న్యూట్రాలిటీ’ సాధిస్తామని భాగస్వాముల సదస్సు ‘కాప్’ వేదిక నుంచి ప్రకటించి ఉన్నాం. కానీ, పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి లక్ష్యాలకు ఇంకా ఆమెడ దూరంలోనే ఉన్నాం. సౌర, పవన తదితరాల్లో ఉత్పత్తి, నిల్వ, రవాణా, బ్యాటరీలు, వాటికవసరమైన వినియోగ వస్తు దిగుమతి.... ఇటువంటివన్నీ సమస్యలే! 500 గిగావాట్స్ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యానికి భారీ పెట్టుబడుల ఆవశ్యకత కూడా ఉంది. 2023 నుంచి 2030 వరకు ఏర్పరచుకున్న లక్ష్యాలు సాధించాలంటే 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. ఉత్పత్తి, నిలువ, రవాణా, గిట్టుబాటు ధరలతో కొనుగోళ్లకు గ్యారెంటీలు లేని చోట పెట్టుబడులకు ఎవరు ముందుకు వస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై భరోసా కల్పించే విధానంతో, పర్యావరణ స్పృహ చేతనతో ప్రభుత్వాలు ముందుకు వస్తే తప్ప బలంగా అడుగులు ముందుకు పడటం కష్టం.
-దిలీప్ రెడ్డి సమకాలీనం
(రచయిత పొలిటికల్ అనలిస్ట్,
డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)













