హైదరాబాద్ : బిజెపి పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు బిసిలకు అన్యాయం చేస్తూనే ఉందని, బిసిలకు ద్రోహం చేస్తున్న బిజెపి చరిత్రలో పతనం కాక తప్పదని అఖిలపక్ష నేతలు తీవ్రంగా హెచ్చరించారు. జాతీయ జనగణనలో సమగ్ర కులగణన చేపడతామన్న ప్రధాని హామీని విస్మరించినందుకు నిరసనగా ఆదివారం ప్రధాని తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ బిసి సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

ఈ నిరసనలో షాద్‌నగర్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఓబిసి స్టేట్ చైర్మన్ ఈర్లపల్లి శంకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరాం, బిఆర్‌ఎస్ శాసనమండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా బిసి సమాజం ‘ప్రధానికి పది ప్రశ్నలు‘ సంధిస్తే 24 గంటలు గడిచినా కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదని విమర్శించారు. బిసి కులగణన చేపడతామని మోసం చేశారని, అందుకే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి ఢిల్లీ పెద్దలకు చెమటలు పట్టించామని తెలిపారు. బిసిలను ఇలాగే మోసగిస్తే భవిష్యత్తులో ప్రధాని పర్యటనను 100 శాతం అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని, బిసిల డిమాండ్లను పరిష్కరించడంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి పూర్తిగా విఫలమైందన్నారు. బిజెపిపై బిసిలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, బిసిలు చేసే పోరాటానికి తన మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ప్రకటించారు. ఈర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బిసిలకు అన్యాయం చేస్తున్న బిజెపికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని, బిసి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నందుకు బీసీలు సిగ్గుపడుతున్నారని అన్నారు. తెలంగాణలో జరిగిన కులగణనను మోడల్‌గా తీసుకొని కేంద్రం చేపట్టాలన్నారు. కులగణనపై బిసి సంఘాల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.

బిఆర్‌ఎస్ నేతలు మధుసూదనాచారి, వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బిజెపి బిసిలకు ద్రోహం చేస్తోందని, భవిష్యత్తులో బిసిల ఆగ్రహానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బిసిలు తలచుకుంటే బిజెపిని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని అన్నారు. తక్షణమే కులగణనపై కేంద్రం స్పందించి బిసిలకు న్యాయం చేయకపోతే ప్రధాని ప్రతి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

నెల్లికంటి సత్యం మాట్లాడుతూ బిజెపి ఆవిర్భావం నుండి నేటి వరకు బిసిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, నాటి మండల్ ఉద్యమం నుండి నేటి కులగణన ఉద్యమం వరకు బిజెపి వైఖరి మారలేదని ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలో బిజెపి బిసి వ్యతిరేక వైఖరిని ఎండగట్టి కోట్లాది బిసిలు ఏకమై బిజెపిని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సాధన కమిటీ అధ్యక్షులు ధనుంజయ నాయుడు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేతురు వెంకటేష్, తాటికొండ విక్రమ్ గౌడ్, ధనలక్ష్మి, ఉప్పరి శేఖర్ సగర, పగిళ్ల ఆశన్న తదితరులు పాల్గొన్నారు.