
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సొంత దేశ క్రికెట్ బోర్డు అనుమతి లేకుండా పాల్గొన్నందుకు ముగ్గురు క్రికెటర్లపై నాలుగు నెలలు నిషేధం విధించింది. నిషేధానికి గురైంది.. సమీవుల్లా షిన్వారి, అఫ్తాబ్ ఆలం, మొహమ్మద్ షెహజాద్ అని తెలుస్తోంది. ఈ ముగ్గురు లీగ్ క్రికెట్లో పాల్గొనేందకు ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) తీసుకోవాలి. కానీ, వీరు అలా చేయలేదు. దీంతో ఈ ముగ్గురిపై బోర్డు చర్యలు తీసుకుంది.
ఈ నాలుగు నెలల కాలంలో షిన్వారి, ఆలం, షెహజాద్‌లు దేశీయ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎక్కడా క్రికెట్ ఆడలేరు. నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ శిక్ష విధించినట్లు అఫ్గాన్ బోర్డు ప్రకటించింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు ఐసిసి లేదా బిసిసిఐ నుంచి గుర్తింపు లేదు. అందువల్ల ఇందులో అవినీతి జరిగే అవకాశం ఉందని బోర్డు అభిప్రాయపడింది. ఈ లీగ్‌లో మరో అఫ్గాన్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ కూడా పాల్గొన్నాడు. కానీ, అతడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.












