
దుబాయ్ : హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రవాణా నిర్వహణ కంపెనీలకు అమెరికా హెచ్చరికలు వెలువరించింది. సురక్షిత ప్రయాణానికి ఈ కంపెనీలు ఇరాన్‌కు నిర్ణీత పన్ను చెల్లించినట్లు అయితే అటువంటి కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు కంపెనీలకు అలర్ట్‌ను అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. హర్మూజ్ మీదుగా నౌకా రవాణా సాగించాలనుకుంటే తమకు నిర్ణీత పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఇటీవలే ఇరాన్ తమ టోల్ ఖరారు చేసింది. దీనిని అమెరికా తీవ్రంగా పరిగణించింది.
హర్మూజ్‌పై నియంత్రణ విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన పర్వం కొనసాగుతున్న దశలోనే అమెరికా హెచ్చరికలు, అంతర్జాతీయ స్థాయి షిప్పింగ్ కంపెనీలపై ఆంక్షల ప్రకటనలతో పరిస్థితి మరింత బిగుసుకుంది. టోల్ చెల్లిస్తే తాము ఊరుకునేది లేదు. ఆంక్షలు వలయంలో పడాల్సి వస్తుందని అమెరికా స్పష్టం చేసింది.












