
ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి‘. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ “ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి... అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం”అని అన్నారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ “పోసాని ఈ కథ చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను. అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది”అని తెలియజేశారు.














