
మన తెలంగాణ/కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మం డలంలోని తుమ్మిడిహట్టి గ్రామం వద్ద నిర్మించనున్న ప్రాణహిత బ్యారేజీ స్థలాన్ని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం పరిశీలించారు. ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, కాల్వల నిర్మా ణం, ముంపు ప్రాంతాల వివరాలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మ్యాప్‌ల ద్వారా బ్యారేజీ రూ పకల్పన, నీటి వినియోగ సామర్థ్యం, సాగునీటి లబ్ధిపై వివరాలు అందించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. అనంతరం తుమ్మిడిహట్టి పుష్కరఘాట్ వద్ద ఏర్పాటుచేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రాణహిత బ్యారేజీ ఎత్తు నిర్ణయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రి ఉతమ్‌కుమార్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఇప్పటికే లేఖ రాశారని తెలిపారు.
వచ్చేవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై బ్యారేజీ ఎత్తు, ముంపు అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును మేడిగడ్డకు మళ్లించడం వల్ల ఉత్తర తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో తుమ్మిడిహట్టి పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్, జిల్లా కలెక్టర్ హరిత, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అదనపు కలెక్టర్ డేవిడ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.















