మన తెలంగాణ/హైదరాబాద్: మొక్కజొన్న మార్కెట్‌కు అధికంగా వస్తున్నందున, ఉమ్మడి జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమిస్తూ, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్, వరంగల్‌కు వ్యవసా య శాఖ సంచాలకులు గోపి, మెదక్ ఖమ్మంకు సహకార శాఖ స్పెషల్ కమిషనర్ రాహుల్ రా జ్, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలకు ఉద్యానవ న సంచాలకులు యాస్మీన్ బాషా, ఆదిలాబాద్, నల్గొండకు హాకా ఎండి కె.చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మిలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. కాగా, మొక్కజొన్న కొనుగోళ్ల లో వేగం పెంచాలని,

ఈ క్రమంలో ఎదురయ్యే హమాలీల కొరత, గన్నీ బ్యాగులు, గోదాముల లభ్యత, రవాణా అంశాల్లో ఇబ్బందులు లేకుం డా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కొనుగోళ్లలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం రూ. 1,650 కో ట్లతో 1.22 లక్షల మంది రైతుల నుండి 6.74 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగో లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు, వరిధాన్యం కొనుగోళ్లు కూడా విస్తారంగా జరుగుతున్నందున, కలెక్టర్లు మొక్కజొన్న కొనుగోళ్లలో కూడా బాధ్యత తీసుకొని, కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి కోరారు.

ఒకవేళ రైతులు గన్నీబ్యాగులను స్వంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుందని మంత్రి తెలియజేశారు. మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా మార్క్ ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు, రవాణా సజావుగా జరిగేట్టు చూడాలన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ దిగుబడులను విక్రయించుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, జిల్లా యంత్రాంగం కొనుగోలు కార్యక్రమాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి గోదాముల వరకు రవాణాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తిని మంత్రి కోరారు. మంత్రి సూచనల మేరకు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌ను నోడల్ అధికారిగా నియమిస్తున్నామని, జిల్లాలో మొక్కజొన్న రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా కలెక్టర్లు నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు.