మన తెలంగాణ/హైదరాబాద్: ఇంట్లో పనిచేసే మనుషులే యజమానిని హత్య చేయడంతో హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో గురువారం అర్దరాత్రి రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ(55) ఆమె నివాసంలో హత్యకు గురయ్యారు. శుక్రవా రం హత్య విషయం తెలిసిన వెంటనే  డిజిపి సివి ఆనంద్, నగర కమిషనర్ వి.సి సజ్జనార్, శాంతి భద్రతల డిజిపి మహేష్ ఎం భగవత్‌లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి, ఘటనపై ఆరాతీశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాలతో ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కల్పన మరో ముగ్గురితో కలిసి ముందస్తు ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తనూజ ఒంటరిగా ఉన్న విషయాన్ని తన గ్యాంగ్‌కు చెప్పిన కల్పన గురువారం అర్ధరాత్రి సమయంలో వారితో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎనిమిది నెలలుగా ఇంట్లో పనిచేస్తున్న కల్పన హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని నిందితులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం పది ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హత్య చేశాక నిందితులు ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లారని, నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి నిందితులు పరారైనట్లు పోలీసులు సిసి టివి పుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుల గాలింపులో భాగంగా లఖ్‌నవూ, ముంబయితో పాటు నేపాల్ సరిహద్దు వరకు బృందాలు వెళ్లినట్లు పోలీసులు వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిందితులకు భూపేందర్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బహిర్గతమయినట్లు సమాచారం. గతంలో నందగిరి హిల్స్‌లోని వ్యాపారి ఇంట్లో రూ.1.3 కోట్ల విలువైన వజ్రాలను భూపేందర్ షాహీ నేపాలీ గ్యాంగ్ చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌తో కల్పనకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, తనూజ భర్త వినయ్ రంజన్‌రే హత్య జరిగిన సమయంలో బెంగుళూరులో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య విషయం తెలిసిన వెంటనే రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఇంటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకుని సంఘటనపై ఆరా తీశారు.

నేపాలీ గ్యాంగ్ పనే..ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం : సిపి సజ్జనార్

రిటైర్డ్ ఐపిఎస్ భార్య తనూజ హత్య కేసులు కీలక ఆధారాలు లభించాయని వాటి ఆధారంగా నేపాలీ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సిపి సజ్జనార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. నేపాలీ గ్యాంగ్ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి భార్య తనూజాను రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో హత్య చేశారని తెలిపారు. రాత్రి వినయ్ రంజన్‌రే ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ నేరం చేసిందని వివరించారు. ఘటన సమయంలో వారి ఇద్దరు పిల్లలు పై అంతస్థులో ఉన్నారని, తనుజ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్లు తెలిపారు. మృతురాలు తనూజ మాజీ డిజిపి వాళ్ల అమ్మకోసం హైదరాబాద్ వచ్చారని, ఇటీవల ఆమె మరణించడంతో అప్పటి నుంచి తనూజా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు.

నిందితులు వెనుక గేట్ నుంచి ఇంట్లోకి ప్రవేశించి, చేతులు వెనక్కి కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కి హత్య చేశారని, ఘటన అనంతరం వెనుక గేటు నుంచే వెళ్లిపోయారని, కొన్ని ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా తదుపరి విచారణ వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఘటనలో బంగారం ఎంత దొంగలించారు, ఇంకా ఏమయినా పోయాయా అనేది విచారిస్తున్నామన్నారు. ఈ కేసును పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించిందని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సిపి చెప్పారు. నేపాలీ పనిమనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, నేపాలీ మనుషులు ఇంట్లో రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా వాళ్లపై కూడా నిఘా ఉంచాలని సిపి సూచించారు. కాగా, వినయ్ రంజన్ రే భార్య తనూజ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి కావడంతో, ప్రశాసన్ నగర్‌లోని ఆమె నివాసానికి మృతదేహాన్ని తరలించారు.

నేపాలీలు అంటేనే హడలిపోతున్న ప్రజలు

ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల నివాస ప్రాంతంలో హత్య జరగడం సంచలనంగా మారింది. నేపాలీ పనిమనుషులు వరుసగా ఘటనలు చేస్తుండడంతో నేపాలీ పనిమనుషులు అంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. గతంలో సెక్యూరిటీ, గుర్ఖాలుగా గతంలో ఎంతో నమ్మకస్తులుగా గుర్తింపు పొంది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ లో ఎక్కువ మంది నేపాలీలు ఉపాధి పొందుతున్నారు. గత ఐదారేళ్లుగా వీరి వ్యవహారంలో మార్పు రావడం, పని మనుషులుగా ఇళ్లలో చేరి ఇంటి పైనే కన్నేసి దోచుకోవడం, అడ్డువస్తే హత్యలు చేయడం పరిపాటిగా మారింది. హైదరాబాద్ లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు నేపాలీలపై మరింత అనుమానం పెంచేలా చేస్తున్నాయి. కొన్ని చోట్ల నేపాలీలు అంటేనే పనిలో పెట్టుకోవడానికి నిరాకరించే పరిస్థితి ఉంండడం, తాజా ఘటనతో నేపాలీ పనివాళ్ళు అంటేనే భయబ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు దశాబ్దాలుగా ఇక్కడ నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేసి బ్రతుకుతున్న నేపాలీ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనతో పోలీస్ శాఖ కూడా ఇళ్లల్లో పనిచేసే నేపాలీలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశముంది.