పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బిజెపి అదే ఉద్వేగంతో తన తదుపరి పంజా పంజాబ్ ఎన్నికలపై విసరబోతోంది. గతంలో కన్నా ఇప్పుడు పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు కమలనాథులకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు శిరోమణి అకాలీదళ్ పొత్తుపెట్టుకుని తన ఉనికిని నిలబెట్టుకున్న బిజెపి ఈసారి 2027 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఏప్రిల్ 24న ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఏడుగురు పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరడం ఆప్‌కు పెద్ద దెబ్బ. ఫిరాయించిన ఏడుగురులో ఆరుగురు పంజాబ్ వారే కావడం గమనార్హం. ఇటీవల మరో ఉదంతం ఆప్ ప్రభుత్వానికి కళంకం తెచ్చిపెట్టింది. పంజాబ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మే 1న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నారన్న ఆరోపణలు బిజెపి, కాంగ్రెస్ వంటి విపక్షాల చేతికి ఆటంబాంబు దొరికినట్టయింది.

భద్రతా సవాళ్లు, డ్రగ్స్ మాఫియా, అవినీతి ఆప్ ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాయి. రెండు మూడు రోజుల క్రితం గ్రేట్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో భూవినియోగ అనుమతుల్లో అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు జరపడం చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఒఎస్‌డిగా ఉన్న అధికారి రజబీర్ ఘుమాన్‌తో సంబంధాలున్న వ్యక్తి నివాసంపై కూడా ఇడి దాడులు జరిపింది. ఈ సందర్బంగా రూ. 500 నోట్ల కట్టలున్న రెండు బ్యాగులను భవనం నుంచి కిందకు విసిరేయడం, మరెవరో వచ్చి వాటిని తీసుకుని పరారవ్వడం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు తీరని అప్రతిష్టగా మారాయి. రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతోంది. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పార్టీలో ‘దళిత ప్రాతినిధ్యం’ గుర్తింపు లేదని తిరుగుబాటు జెండా ఎగురవేశారు.

ఇది రచ్చకెక్కడంతో కాంగ్రెస్‌పై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. గత ఫిబ్రవరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనకు వచ్చి పార్టీ నాయకులను గట్టిగా మందలించారు. కుమ్ములాటలు కట్టిపెట్టి నాయకులంతా ఒక టీమ్‌గా ముందుకు వెళ్తేనే ఎన్నికల్లో విజయావకాశాలు ఉంటాయని సూచించారు. కాంగ్రెస్‌లో చీలికలు మరింత పెరుగుతాయని బిజెపి అంచనా వేస్తోంది. అయితే కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఓటర్ల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వీలుగా కాంగ్రెస్ ‘హిడెన్ అబ్జర్వర్లు’ 45 మందిని రంగం లోకి దింపింది. పంజాబ్‌లో ఒక విలక్షణ రాజకీయ దృశ్యం కనిపిస్తోంది. ప్రాంతీయత, కులం ఆధార సమాజాల పట్టు, ఎన్నికలను ప్రభావితం చేస్తుంటాయి. రాష్ట్రంలో ఓటు బ్యాంకులో దళితులు 32 నుంచి 38 శాతం, షెడ్యూల్డ్ కులాలు 31.91 శాతం, ఒబిసిలు 25 నుంచి 30 శాతం వరకు ఉంది. దీన్ని గమనించి బిజెపి ఇప్పటికే ఒబిసిలను, దళితులను తమ పక్షం వైపు తిప్పుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కేంద్రం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2014 నుంచి సిక్కుల అనుకూల వైఖరిని చాటి చెబుతోంది.

ఇంతవరకు పంజాబ్‌లో ఉనికిని కోల్పోకుండా నెట్టుకొస్తున్న బిజెపి ఈసారి 2027 ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం సాహసమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పంజాబ్‌లో బిజెపి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ హిందూ సమాజం, పట్టణ వర్గాల మద్దతుతో తన ఉనికిని చాటుకునేది. 19771980 అత్యవసర పరిస్థితి తర్వాత జనసంఘ్ ఇతర పార్టీలతో కలిసి జనతా పార్టీలో విలీనం అయింది. 1980న జనసంఘ్ నాయకులు జనతా పార్టీ నుంచి వేరుపడి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1980 నుంచి బిజెపి పంజాబ్ రాజకీయాల్లో ఒక చిన్నభాగంగా ఉంటూ వస్తోంది. 1992కు ముందు భారతీయ జనసంఘ్‌గా బిజెపి ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 6 నుంచి 7 శాతం ఓట్లనే దక్కించుకోగలిగింది. 1997లో అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకుని 8 శాతం వరకు ఓటు వాటా పెంచుకుంది. చాలా కాలంగా శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి)తో పొత్తు పెట్టుకుని మొత్తం 117 సీట్లలో కేవలం 23 సీట్లలోనే పోటీ చేసేది.

2020లో కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెరపైకి తీసుకురావడంతో అకాలీదళ్‌కు, బిజెపి మధ్య పొత్తు బెడిసికొట్టింది. అప్పటి నుంచి బిజెపి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 2022లో పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 6.6 శాతం ఓట్లను పొందగలిగింది. 2024లో లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినప్పటికీ, తన ఆధిక్య ఓటు బ్యాంకును 18.5 శాతంగా నమోదు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్‌ను వెనక్కునెట్టి మూడో రాజకీయశక్తిగా బిజెపి ఎదగడంతో ఆ పార్టీలో తమ బలంపై ప్రగాఢ విశ్వాసం పెరిగింది. అందుకనే గత మార్చిలో జరిగిన బద్లావ్ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇకపై పంజాబ్ రాజకీయాల్లో బిజెపి ‘చోటా బాయ్’ గా ఉండబోదన్నారు. సొంత శక్తితో 117 స్థానాల్లో పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం పంజాబ్ రాజకీయ చిత్రం సంక్లిష్టంగా మారింది. ఆప్, కాంగ్రెస్, బిజెపి, ఎస్‌ఎడి, ప్రధాన పార్టీలతోపాటు బిఎస్‌పి, సిపిఐ, ఇతర పార్టీలు రంగం లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏదేమైనా చతుర్ముఖ పోటీ తప్పదని చెబుతున్నారు.