తెలంగాణలో శాంతిభద్రతలు

ప్రమాదకర స్థాయికి పడిపోయాయి

ప్రజల రక్షణ, భద్రత గాలిలో

కలిసిపోయింది బిఆర్‌ఎస్ నేత కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ కక్షసాధింపుల కోసం ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే వినియోగిస్తున్నారని దీనివల్ల ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందని కెటిఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల క్షీణతపై బిఆర్‌ఎస్ ప్రతినిధి బృందం డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డిజి ర్యాంక్ ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య అత్యంత దారుణంగా హత్యకు గురవ్వడం దిగ్భ్రాం తి కరమని ఆయన పేర్కొన్నారు. గురువారం రాత్రి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒకయువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందని, ఇది సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతా భావానికి అద్దం పడుతోందని కెటిఆర్ స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు

నేరాల నివారణ, ప్రజా భద్రతపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటోందని కెటిఆర్ ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షసాధింపు చర్యలకు వాడుకోవడం వల్లనే శాంతిభద్రతలు కుప్పకూలాయని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు భారీగా పెరిగినట్లు తాజా ఎన్‌సిఆర్‌బి నివేదికలు చెబుతున్నాయని, ఇది ప్రస్తుత ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని కెటిఆర్ గుర్తుచేశారు. హోం శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న రేవంత్‌రెడ్డి ప్రజల ప్రాణాలను రక్షించడంలోనూ, శాంతిభద్రతలను కాపాడటంలోనూ ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజకీయ వేధింపులు ఆపి, పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజల్లో భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.