
విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలి
శాసనసభ, శాసనమండలి విప్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి విప్‌లతో శనివారం సాయంత్రం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలను విప్‌లు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో త్రాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను ముఖ్యమంత్రికి వారు తెలియచేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిఎం దిశానిర్దేశం చేశారు.
సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సిఎం సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలని సిఎం తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సిఎం
సూచించారు. ప్రభుత్వ విప్‌లతో సమన్వయం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒక రోజు విప్‌లకు అందుబాటులో ఉంటానని సిఎం తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపి వేం నరేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణారావు, రామచంద్రు నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్‌లు పాల్గొన్నారు.










