
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సంచలన విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఆర్‌సిబిని ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా లక్ష్య చేధనలో స్టార్ బ్యాటర్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఔట్ స్వింగర్ బంతిని అంచనా వేయలేక తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఐపిఎల్‌లో లక్ష్యఛేదనలో విరాట్ డకౌట్ అవడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. అయితే విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాను అతడిపైనే ప్రయోగించి ఔట్ చేశానని ప్రిన్స్ తెలిపాడు.
‘‘ఈ సీజన్‌లో ఆర్సిబితో జరిగిన గత మ్యాచ్ అనంతరం విరాట్ భయ్యాతో నేను మాట్లాడాను. బంతి ఒక నిర్దిష్ట లెంగ్త్‌లో స్వింగ్ అవుతున్నంతసేపు అదే లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చాడు. ఇప్పుడు తెలివిగా ఆ చిట్కానే పాటించి కోహ్లీని ఔట్ చేశాను’’ అని ప్రిన్స్ పేర్కొన్నాడు. ఈ పోరులో ప్రిన్స్.. కోహ్లీతో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బేతల్‌ను పెవిలియన్‌కు పంపి ఆర్‌సిబిని చావు దెబ్బ కొట్టాడు.















