1Verse 1
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగ జీవులు పుట్ట నుడివెద సుమతీ!
Meaning
ఓ మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులును సేబాసనునట్లుగా, నోటి నుండి నీళ్లూరునట్లుగా, రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.
2Verse 2
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
Meaning
ఓ మంచి బుద్ధిగలవాడా! కుక్కది హీనగుణము, దానిని మంచి ముహూర్తమునాడు బంగారపు సింహాసనమున కూర్చొండబెట్టిననూ హీన బుద్ధి విడవదు. అలాగే హీనుని ఉన్నత స్థానమున కూర్చొండబెట్టిననూ అతని బుద్ధి మారదు అని భావం.
3Verse 3
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!
Meaning
ఓ సుమతీ భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే మూర్ఖుడు దాచి ఉంచిన బంగారం రాజులపాలై అతనికి ఉపయోగపడకపోవును.
4Verse 4
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
Meaning
ఓ సుమతీ! పామునకు తలయందు విషముండును. తేలుకు విషము తోకలో ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషికి తల, తోక యనక శరీరమంతయు విషము ఉండును.
5Verse 5
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
Meaning
ఓ సుమతీ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నపుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలగును.
6Verse 6
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లుండును గొల్లఁడౌనె గుణమున సుమతీ!
Meaning
ఓ సుమతీ! తన్ను ప్రేమించని పెండ్లామును, ప్రేమించని యజమానుని, ప్రేమింపని స్నేహితుని విడచిపెట్టుటకు ఇష్టంకాని వాడే వెర్రిగొల్లవాడు అగును. కాని భూమియందు గొల్లకులమున పుట్టిన వాడు స్వభావ గుణములచే వెర్రిగొల్లవాడు కాడు. ప్రేమించని వాళ్ళతో స్నేహము చేయువానిని వెర్రిగొల్లవాడని అందురు. జాతిచే గొల్లడైనచో గొల్లడనే అంటారు.
7Verse 7
మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
Meaning
ఓ సుమతీ! మాటకు సత్యమే ప్రాణము. ఈ ప్రపంచమున కోటకు ప్రాణము వీరులైన సైనికులే అగుదురు. స్త్రీకి శీలమే ప్రాణము, అట్లే చీటీకి సంతకమే ప్రాణము. అనగా సంతకములేని చీటీ వ్యర్థమే కదా! అని భావం.
8Verse 8
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నకఁజేయువాడె నేర్పరి సుమతీ!
Meaning
ఓ సుమతీ! మనకు ఉపకారము చేసిన వారికి తిరిగి ఉపకారము చేయుట మంచి లక్షణము. అంతేగాని అందులో ప్రత్యేకత లేదు. కానీ అపకారము చేసిన వారిపై నెపములెన్నక తిరిగి వారికే ఉపకారము చేయగలిగినవాడే "నేర్పరి" అనిపించుకొనును.
9Verse 9
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
Meaning
ఓ సుమతీ! ఎవరికైనా తన కోపమే తన శత్రువగును. తన శాంతమే తనకు రక్షగా నిలుచును. తను చూపెడి దయాగుణమే బంధువులవలె సహకరించును. తాను సంతోషముగా ఉండగలిగినచో అది స్వర్గంతో సమానం. తాను దుఃఖమును చేతులారా తెచ్చుకొనినచో అదియే నరకమగుట తథ్యం అని భావం.
10Verse 10
కొఱగాని కొడుకు పుట్టినఁ
కొఱగామియె కాదు తండ్రి గుణముల జెఱచున్
జెఱకు తుద వెన్ను పుట్టిన
జెఱకునఁ దీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ!
Meaning
చెరకుగడ చివర వెన్నుపుట్టినచో యా చెరుకుగడ యందలి తీపినంతయునూ ఎట్లు చెరచునో అట్లే అప్రయోజకుడగు కుమారుడు పుట్టిన ఆ వంశమునకు ఉపకారి కాకపోయిననూ సరికదా, తన తండ్రి మంచి గుణములను చెరచును, చెడ్డపేరు తెచ్చును అని భావం.
11Verse 11
వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
Meaning
ఓ సుమతీ! ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడక నిదానంగా ఆలోచించాలి. అలా ఆలోచించి సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.
12Verse 12
కూరిమిగల దినములలో
నేరములెన్నడును గలుగనేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండ నిక్కము సుమతీ!
Meaning
ఓ సుమతీ! స్నేహము బాగుగా ఉన్న రోజులలో ఆ స్నేహితులకు ఒకరు చేసిన పనులలో మరొకరికి తప్పులు కనిపించవు. అదే స్నేహితులకు విరోధము వచ్చినపుడు ఒకరి చేష్టలు మరొకరికి దోషములుగా కనిపించును అని భావం.
13Verse 13
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగఁజెఱువు నిండినఁ
గప్పలు పదివేలుఁజేరుఁగదరా సుమతీ!
Meaning
మనకు ఎప్పుడైతే సంపదలు చేకూరునో, అప్పుడు బంధువులు అధికంగా వచ్చుదురు. ఎలాగనగా చెరువు నిండా నీరు చేరి అలలు వచ్చునట్టి సమయమున వేల కొలది కప్పలు వచ్చి చేరినట్లు అని భావం.
14Verse 14
అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును,ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ!
Meaning
ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండ ప్రవహించు నదియును బ్రాహ్మణుడు గల గ్రామమందు నివసింపుము. వారులేని గ్రామమందు నివసింపకుము.
15Verse 15
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
Meaning
అల్లుని మంచితనము, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడుదాని యందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులను లోకములో నుండవు.
16Verse 16
కోమలి విశ్వాసంబున
బాములతోఁజెలిమి యన్య భామలవలపున్
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ!
Meaning
స్త్రీల యొక్క నమ్మకమును, పాముల యొక్క స్నేహమును, పరస్త్రీల యొక్క మోహమును, వేపచెట్ల యొక్క తియ్యదనమును, రాజుల యొక్క విశ్వాసమును నమ్మరాదు. అవి అసత్యములుగా నిర్ణయించి జీవనము చేయాలి అని భావం.
17Verse 17
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కఱిగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
Meaning
ఓ సుమతీ! బంగారమునకు సమానమైన ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించి పోసినను బంగారము ఎట్లు కాదో, అదేవిధంగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు.
18Verse 18
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలఁగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!
Meaning
ఓ సుమతీ! అడిగినపుడు జీతమును ఈయని గర్వియైన ప్రభువుని సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయము చేసుకొని జీవించుట మంచిది అని భావం.
19Verse 19
చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మాను మిదియె మతముర సుమతీ!
Meaning
ఓ సుమతీ! మనస్సునందు జరిగిపోయిన పనిని గురించి ఆలోచించుటయును, స్త్రీలు ప్రేమించెదరని విశ్వాసమును వ్యక్తము చేయుటయును, అంతఃపుర స్త్రీలతో రహస్యములను మాట్లాడుటయును సద్గుణములుగల వాడు వెంటనే విడిచి పెట్టవలెయును. ఇదియే మంచి నడవడి సుమా!
20Verse 20
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుఁగదరా సుమతీ!
Meaning
ఓ సుమతీ! అవసరమునకు పనికిరాని చుట్టము, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినపుడు ముందుకు పరిగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్ట వలెను.
21Verse 21
తలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి నిజములేదు వివరింపగాఁ
దల దడివి బాస జేఁసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!
Meaning
ఓ సుమతీ! వేశ్యకు నిలువెత్తు ధనమిచ్చినప్పటికీ నిజాము చెప్పదు. పైగా తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసిననూ వేశ్యను నమ్మరాదు. కల్లలాడి పురుషుని వశపరచుకొనును అని భావం.
22Verse 22
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
Meaning
ఓ సుమతీ! టెంకాయ లోపలి నీరు వచ్చినట్లు సంపద తెలియకుండానే వస్తుంది. ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలె సంపద తెలియకుండానే మాయమవుతుంది అని భావం.
23Verse 23
నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మగసాలివాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!
Meaning
ఓ సుమతీ! లోకములో ఇంటి పన్నులు వసూలు చేయు వానిని, జూదమాడు వానిని, స్వర్ణవృత్తి చేయువారిని, వేశ్యలను, వస్తువులను అమ్మేవారిని, ఎడమ చేతితో పనులు చేయువారిని నమ్మరాదు అని భావం.
24Verse 24
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
Meaning
ఓ సుమతీ! పెద్దల సభలయందు నవ్వరాదు, తల్లి, తండ్రి, యజమానుల యందు నవ్వరాదు. ఇతరుల భార్యయైన స్త్రీలను చూచి నవ్వరాదు, బ్రాహ్మణులందు పరిహాసముగా నవ్వరాదు అని భావం.
25Verse 25
పగవల దెవ్వరితోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
Meaning
ఓ సుమతీ! లోకమునందు ఎటువంటి వారితోనూ శత్రుత్వము పెట్టుకొనరాదు. దారిద్ర్యము వచ్చిననూ విచారింపరాదు. సభయందు ఎవ్వరినీ దూషించరాదు. స్త్రీలకు తనయొక్క హృదయమును తెలియనీయరాదు అని భావం.
26Verse 26
పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్
దన భుక్తియెడలఁదల్లియు
యనఁదన కులకాంత యుండనగురా సుమతీ!
Meaning
ఓ సుమతీ! లోకమునందు కులకాంతలు ఇంటి పనులయందు దాసివలె, భోగించునపుడు రంభవలె, ఆలోచన చెప్పునపుడు మంత్రివలె, భోజనము పెట్టునపుడు తల్లివలె భర్తయందు అనురాగంతో ఆచరించాలి అని భావం.
27Verse 27
ఎప్పుడుఁదప్పులు వెదకెడు
నప్పురుషునిఁగొల్వఁగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
Meaning
ఓ సుమతీ! నల్లతాచు యొక్క పాడగా నీడను వసించు కప్ప బతుకుదెంత కాలము? అంటే పాము తాను పెట్టిన గుడ్లను తానే తినును. అలాగే నీడకొరకున్న కప్పను కూడా ఏదో ఒక సమయమున మింగును. అలాగే ఎల్లప్పుడూ దోషములు వెదకుచూ ఉన్న యజమానుని సేవ కడుంగడు కష్టతరము. ప్రాణాపాయమని వ్యక్తమగుచున్నది. వాని బతుకు కప్పవలె పోల్చినాడు కవి.
28Verse 28
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచుకడకుఁజనకుర సుమతీ!
Meaning
ఓ సుమతీ! నీరు త్రాగెడి గుఱ్ఱము వద్దకు, క్రొవ్వుచే విజ్రుంభించు మదపు ఏనుగు వద్దకు, ఆవు దగ్గరున్న ఆంబోతు వద్దకు, విద్యనేర్వని మానవుని వద్దకు వెళ్ళరాదు. వెళ్ళినచో గుర్రము సకిలించును. ఏనుగు తొండంతో కొట్టును. ఆంబోతు పొడిచి చంపును. విద్యలేనివాడు వింత పశువు వలె ప్రవర్తించును. వీటి నుండి తప్పించుకొని వెళ్ళుట మంచిది.
29Verse 29
వరిపంట లేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
Meaning
ఓ సుమతీ! వరిపంట లేని ఊరును, ప్రభువు లేని ఊరును, సమయము దొరకని మార్గమును, భర్తలేని ఇల్లును ఆలోచింపగా స్మశానము వలె ఉండును. కనుక పంటలు, ప్రభువు, మార్గము, భర్త ఉండాలని భావం.
30Verse 30
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!
Meaning
ఓ సుమతీ! లోకములో పట్టణమునకు వ్యాపారి ప్రాణాధారము. వరిచేనుకు నీరు ప్రాణాధారము. ఏనుగునకు తొండము ప్రాణాధారము. సంపదకు స్త్రీ ప్రాణాధారము అని గుర్తించి సంసారము చేయాలని భావం.
31Verse 31
లావుగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
Meaning
లోకమునందు శరీరబలమున్న వాని కంటే న్యాయంగా ఉండువాడు బలవంతుడని లెక్కించుకోవాలి. ఎట్లనగా పర్వతమంతటి ఏనుగు కంటెనూ, చిన్నవాడైన మావటివాడు అట్టిదానిని లొంగదీసుకొని ఎక్కుచున్నాడు కదా! కనుక శరీర బలము కలవాని కంటే బుద్ధి బలము కలవాడే నిజముగా బలవంతుడని అర్థము.
32Verse 32
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
Meaning
ఓ సుమతీ! నేలమీద పచ్చికాయలను ఏరి తినకుము, చుట్టములను తినవద్దు, యుద్ధమునందు వెనుతిరిగి పోరాదు, పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు. ఇవన్నియు సమయము చూచి విపత్తులను కల్గించునని భావం.
33Verse 33
ఒకయూరికి నొక కరణము
నొకతీర్పరియైనఁగాక యొగిఁదరు చైనన్
గకవికలు గాక యుండునె
సకలంబున గొట్టువడక సహజము సుమతీ!
Meaning
ఓ సుమతీ! ఒక గ్రామమునకు ఒక కరణము, ఒక ధర్మాధికారి ఉండవలెను. అట్లుగానిచో బహుకరణములు, బహుధర్మాధికారులు ఉంటే గ్రామములో సమస్యలు ఎక్కువగా ఉండును. బహు నాయకత్వములగును. గ్రామ కీర్తి నశించును. సమాజము చెడిపోవును. పనులకాటంకం కలుగును అని భావం.
34Verse 34
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁగలిమిలేమి వసుధను సుమతీ!
Meaning
ఓ సుమతీ! ఓడల మీద బండ్లును, బండ్ల మీద నావలను వచ్చునట్లుగానే భాగ్య వంతులకు దారిద్ర్యమును, దారిద్ర్యవంతులకు భాగ్యమును బండి చక్రపుటాకుల వలె వచ్చును. కలిమిలేములు స్థిరము కాదని భావము.
35Verse 35
కరణము సాధై యున్నను
గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!
Meaning
ఓ సుమతీ! భూవి పైన గ్రామ లెక్కలు వ్రాయు కరణము నెమ్మదివాడైననూ, ఏనుగు మదము పోయినదైననూ, పాము కరవకున్ననూ, తేలు కుట్టకున్ననూ ఆశ్చర్యంతో మిక్కిలి తేలిక భావంతో చూతురు. ఇలాంటివారిని నమ్మరాదు అని భావం.
36Verse 36
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంతకలిఁగిన
దనభాగ్యమె తనఁకుగాగ తథ్యము సుమతీ!
Meaning
ఓ సుమతీ! ధనమునకు పతియగు కుబేరుడు తనకు స్నేహితుడైనప్పటికినీ, శివుడు భిక్షము ఎత్తవలసి వచ్చినది కదా! అలాగే తనకు సంబంధించిన వారికి ఎంత ధనమున్ననూ తనకు ఉపయోగపడదు. తన అదృష్టఫలమే తనకు లభించును. పరులకున్న ధనమెన్నటికినీ రాదనీ భావం.
37Verse 37
పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁగనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
Meaning
ఓ సుమతీ! అదృష్టమున్న రోజులలో అన్ని ద్రవ్యములు అరణ్యములందున్ననూ పొందగలవు. అదృష్టము లేనిచో బంగారపు కొండమీదయున్ననూ అన్ని ద్రవ్యములు అనుభవింపలేరు, అంటే అవి లభించవు అని భావం.
38Verse 38
కమలములు నీటఁబాసినఁ
గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
Meaning
ఓ సుమతీ! కమలమునకు నివాసము నీరు, ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచి పెట్టిన తరువాత మిత్రుడగు సూర్యుని వేడిచే కమలిపోవును. అలాగే మానవులు తమ తమ నివాసములను విడిచి పెట్టినచో, తమ స్నేహితులే విరోధులుగా మారి బాధించును. ఇది నిజమని గ్రహించాలి.
39Verse 39
పొరుగునఁపగవాఁడుండిన
నిర వొందఁగ వ్రాతగాఁడు ఏలికయైనన్
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
Meaning
ఓ సుమతీ! శత్రువు తన ఇంటి పక్క ఉన్ననూ, రాజ్యపాలన చేయుచూ, లెక్కలు వ్రాయగల ప్రభువైనచో, గ్రామ పెత్తనదారు కొండెములు చెప్పువాడైననూ గ్రామ కరణము జీవితము జరుగదు. మోదాలు అరికట్టునని భావం.
40Verse 40
కరణముల ననుసరింపక
విరసంబునఁదిన్న తిండి వికటించు జుమీ
యిరుసునఁగందెనఁబెట్టక
పరమేశ్వరుబండియైన బాఱదు సుమతీ!
Meaning
ఓ సుమతీ! బండి ఇరుసునకు కందెన పెట్టకున్నచో భగవంతుని బండినైననూ పరిగెత్తదు. అలాగే కరణముతో పని ఉన్నచో రుసుము చెల్లించక పనులను పూర్తి చేయించుకోలేరు. అందుచే బండి ఇరుసునకు ఆముదము వేసినట్లు ఆ కరణమును హితముగానుండి పనులను చక్కబెట్టుకోవాలని అనుభవమును ప్రకటించెను.
41Verse 41
బలవంతుఁడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!
Meaning
నేను బలవంతుడను, విద్యావంతుడను అని గర్వముచే సంచరించరాదు. అపుడు జనులు విరోధము తెచ్చి కించపరచక మానరు. ఎట్లనగా బలవంతమైన పాము చలిచీమలచే చిక్కి చావుట లేదా! చీమలను చంపుట పాములకు అసాధ్యము కదా! సాటివారితో సమయానుకూల స్నేహము చేయాలని బోధ.
42Verse 42
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁదఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!
43Verse 43
కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!
Meaning
ఓ సుమతీ! చీటికిమాటికి భార్యతో తగువులు పెట్టుకొనరాదు. లేని నేరములు ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలి యొక్క కంటనీరు కింద పడినచో ఆ ఇంట సంపద తొలగిపోవును. అనగా సంపద,సౌఖ్యము తొలిగి దారిద్ర్యము రాగలదని భావం.
44Verse 44
రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజు గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ!
Meaning
ఓ సుమతీ! రూఢీ చేసి మాట్లాడిన తరువాత అబద్ధములు పలుకరాదు. సహాయముగా ఉండు బంధువులను నిందించరాదు. కోపస్వభావముగల రాజును సేవించరాదు. పాపాత్ములుండెడి దేశమునందు నివశించరాదు, ఇవి తగని పనులు కనుక ఈ విషయములందు జాగ్రత్త అవసరమని భావం.
45Verse 45
వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
Meaning
వేశ్య ప్రమాణములను నమ్మదు. స్వర్ణపు వృత్తివారి స్నేహము చేయవద్దు. వెలమదొరల వెంట ఉండవద్దు. కలలో చూచిన సంపద రాదు. ఎప్పుడు కూడా తన స్వశక్తితో ఆలోచించి పనులు పూర్తి చేసుకోవాలని భావము.
46Verse 46
క. కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుడు గవయ గూడుట యెల్లన్
బ్రేమమునఁజెఱకుపిప్పికి
జీమలు వెస మూఁగినట్లు సిద్ధము సుమతీ!
Meaning
ఓ సుమతీ! ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడచిన స్త్రీని, మరియొక విటుడు ఆ స్త్రీ కొరకు నిరీక్షించి, అనుభవింప కోరుట చెరకు నందు రసమును పూర్తిగా తీసివేసిన తర్వాత, ఆ పిప్పికై చీమల దండు ముసురుకున్నట్లు ఉండును కదా! అని భావం.
47Verse 47
పరసతి కూటమిఁగోరకు
పరధనముగల కాసపడకు పరునెంచకుమీ,
సరిగాని గోష్ఠి సేయకు,
సిరిచెడిఁజుట్టంబుకడకుఁజేరకు సుమతీ!
Meaning
ఓ సుమతీ! లోకములో పరస్త్రీలు కామించు కోరిక కోరవద్దు. ఇతరుల సంపదలను కోరవద్దు. ఇతరుల తప్పులనెంచవద్దు. మంచిది కాని సంభాషణనమును, సరితూగని వారితో స్నేహమును చేయకుము. సంపద పోయినపుడు దుఃఖించుచూ తన బంధువుల కడకు వెళ్ళవద్దు. అందుచే ఆపదలు కలుగును.