తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2023లో బీఆర్ఎస్‌ను ఓడించామని, 2029లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నువ్వో, నేనో తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేశామని పేర్కొన్న ఆయన, వచ్చే 2029 ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించిన అనంతరం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతులకు "రైతు భరోసా" పథకం కింద రెండు విడతల నిధులను విడుదల చేశారు.
సభలో ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు నిర్మించి, రైతులకు సాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చట్టాన్ని తీసుకువచ్చినదీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కూడా కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంలో కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం, "2023లో బీఆర్ఎస్‌ను గద్దె దించాం. 2029లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను" అని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఇదే తన సవాల్ అని వెల్లడించారు.
"వచ్చే ఎన్నికల్లో నువ్వో, నేనో తేల్చుకుందాం" అంటూ కేసీఆర్‌కు ప్రత్యక్షంగా సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.















