
తెలంగాణలోని జర్నలిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేయనున్నట్లు సిఎం తెలిపారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రివర్గ సమావేశం ఉంటుందని, అదే రోజున జర్నలిస్టుల ఇళ్ళ పట్టాల అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. జూన్ 2వ తేదీ లోపు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
"జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జర్నలిస్టులకు శుభవార్త చెబుతాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. క్యాబినెట్ ఆమోదం ఉంటే చట్ట బద్దత ఉంటుంది" అని సిఎం పేర్కొన్నారు.














