న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జి ధరలు భారీగా పెరగడంతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్‌జిస్ ధరను కిలోకు రూ.3.89 పెంచింది. పశ్చిమాసియాలో మరోమారు నెలకొన్న సంక్షోభం, హోర్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా రవాణాకు అంతరాయాలు ఏర్పడటం వల్ల అంతర్జాతీయ ఎల్‌ఎన్‌జి ధరలు గణనీయంగా పెరిగాయని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన ఈ ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఢిల్లీలో సిఎన్‌జి ధర కిలోకు రూ.83.09 నుంచి రూ.86.98కు చేరింది. ఈ తాజా పెంపుతో ఈ ఏడాది ఢిల్లీలో సిఎన్‌జి ధర మొత్తం దాదాపు కిలోకు రూ.10 మేర పెరిగింది. మే రెండో వారంలో నాలుగు విడతల్లో మొత్తం రూ.6 పెంచడంతో ధర రూ.83.09కు చేరింది. తాజాగా మరో రూ.3.89 పెంచారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్‌లలో కూడా సిఎన్‌జి ధరలు పెరిగాయి. ప్రస్తుతం నోయిడా, ఘాజియాబాద్‌లో కిలో సిఎన్‌జి ధర రూ.95.59 కాగా, గురుగ్రామ్‌లో రూ.92.01గా ఉంది.