రాష్ట్రంలో ఇవి చార్జింగ్ నెట్‌వర్క్‌కు భారీ బూస్ట్

హైదరాబాద్‌లో 200, ఎన్‌పిడిసిఎల్ పరిధిలో 169 స్టేషన్లు

ఆరు క్లస్టర్లలో 200 స్టేషన్లు

పదేళ్లపాటు కాంట్రాక్ట్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ ఇవి ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టిజి రెడ్కో) కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 369 పబ్లిక్ ఇవి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రయివేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లను (సిపిఓలు) ఆహ్వానిస్తూ టెండర్లను జారీ చేసిందని టీజీ రెడ్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, ఇవి ఛార్జింగ్ స్టేషన్ల విద్యుత్ వినియోగం పరంగా దేశంలో రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచిందన్నారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వాటికి అనుగుణంగా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భౌగోళికంగా రాష్ట్రానికి ఎంతో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని, రాష్ట్రం మీదుగా అనేక జాతీయ రహదారులు, ప్రధాన రవాణా మార్గాలు విస్తరించి ఉండటంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణా గణనీయంగా జరుగుతున్నాయన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల జీవనశైలిలో వేగంగా వస్తున్న మార్పులు, పట్టణీకరణ, వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిణామాలు రాష్ట్రాన్ని ఇవి రంగంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అత్యంత అనుకూలమైన మార్కెట్‌గా మారుస్తున్నాయి అని తెలిపారు.

పెరుగుతున్న ఇవి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయివేట్ రంగం ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా దీర్ఘకాలికంగా, వాణిజ్యపరంగా నిలకడైన ఇవి ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే టీజీ రెడ్కో లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మునిసిపల్ ప్రాంతాలను కవర్ చేస్తూ రెడ్కో సంస్థ ఏర్పాటు చేసిన 200 పబ్లిక్ ఇవి ఛార్జింగ్ స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నామన్నారు. ఎంపికైన సిపిఓలు వీటి ఆపరేషన్, మెయింటెనెన్స్, అప్‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ బాధ్యతలను పది సంవత్సరాల పాటు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఎన్‌పిడిసిఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 169 పబ్లిక్ ఇవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నుట్ల వివరించారు. అందుబాటు ధరలో ఛార్జింగ్ సదుపాయాన్ని అందించడంతో పాటు, సిపిఓలకు దీర్ఘకాలికంగా స్థిరమైన వ్యాపార అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రాజెక్టులను రూపొందించినట్లు పేర్కొన్నారు.