
ఖాట్మండూ: నేపాల్ భీకర వరదల్లో మృతుల సంఖ్య శనివారం 626కు చేరింది. ఇప్పటి వరకూ 2,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 2,400 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వీలైనంత మందిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో గత బుధవారం హిమనదం కూలిపోవడంతో మంచు, రాళ్లు భారీగా విరుచుకుపడి, వరద నీరు, బురద, శిథిలాలు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లడంతో మధ్య నేపాల్‌లో దారుణ విధ్వంసం చోటుచేసుకుంది. ఊళ్లకు ఊళ్లు, వాహనాలు, రహదారులు, వంతనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.
నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజిమెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం నేపాల్‌లో 626 మంది మృతి చెందారు. చైనా వైపు ఏడుగురు మరణించినట్టు టిబెట్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ డిపార్‌ె్ట్మంట్ వెల్లడించింది. 5,000 మంది నేపాల్ సైనికులు సహా 11,000 మంది భద్రతా సిబ్బంది గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేపాల్ ఆర్మీ ప్రజాసంబంధాల డైరెక్టరేట్ ప్రకారం, ఇప్పటి వరకూ 2,465 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 163 మంది విదేశీయులు ఉన్నారు. ఈ విదేశీయుల్లో 113 మంది భారతీయులు, 26 మంది చైనీయులు, 15 మంది దక్షిణ కొరియన్లు, నలుగురు జనర్మన్లు, ఇటలీ, అమెరికాకు చెందిన ఇద్దరేసి, ఒక ఒమన్ పౌరుడు ఉన్నారు.
సొరంగం నుంచి బయటపడిన 191 మంది
త్రిసూలి, రసువా ప్రాంతంలోని వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల నుంచి 191 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 2,265 మందిని హెలికాప్టర్ల ద్వారా, మరో 200 మందిని రహదారి మార్గాల ద్వారా భద్రతా సిబ్బంది తరలించారు. ధుంచే, త్రిశూలిలో అత్యవసర ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకూ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించిన 1,706 మందికి వైద్య సహాయం అందించారు. వరద బాధితులకు చికిత్స అందుతుండటంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ఆచూకీ గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల వద్ద సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఖాట్మండును దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రధాన రహదారి ముగ్లింగ్-ఖాట్మండు హైవేను శనివారంనాడు తిరిగి అందుబాటులోకి తెచ్చారు.
సహాయక చర్యలకు 11 మంది భారత సభ్యుల బృందం
మరోవైపు, మెరుపు వరదల అనంతరం స్థానిక అధికారులకు రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం అందించేందుకు 11 మంది సభ్యులతో కూడిన భారత బృందం నేపాల్‌కు శనివారంనాడు చేరుకుంది. వైద్య సిబ్బంది, సొరంగ మార్గాల్లో సహాయక చర్యలు చేపట్టే నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. నేపాల్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ టీమ్ నేపాల్ చేరుకున్నట్టు భారత రాయబార కార్యలయ వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో సహాయక, రక్షణ చర్యలు కొనసాగుతున్న వరద ప్రభావిత ప్రాంతాలకు ఈ బృందాన్ని పంపిస్తున్నారు. తొలుత దేశ భద్రతా బలగాలనే సాధ్యమైనంత ఎక్కువగా మోహరించడానికి ప్రాధాన్యత నిస్తున్నట్టు నేపాల్ శుక్రవారం తెలిపింది. అయితే అత్యంత సంక్లిష్టమైన, ప్రత్యేక సాంకేతక నైపుణం అవసరమైన కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయ సహాయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోరవాణా సేవలను పునరుద్ధరించేందుకు 42 బైలీ వంతెనల నిర్మాణంలో సహాయం చేయాలని భారత్, చైనాలను నేపాల్ కోరింది. ఈ తాత్కాలిక వంతెనలను భారీ యుంత్రాలు, ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా వేగంగా అమర్చుకునేలా రూపొందించారు.
విపత్తు సహాయ నిధికి భారీగా విరాళాలు
మరోవైపు, నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధి (పీఎండీఆర్‌ఎఫ్)కి శుక్రవారం రాత్రి నాటికి రూ.229.5 కోట్లకు పైగా విరాళాలు అందాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం అర్ధరాత్రి వరకూ కేవలం 36 గంటల్లో రూ.191 కోట్ల సాయం అందగా, శుక్రవారం ఒక్కరోదే రూ.38.55 కోట్ల విరాళాలు వచ్చినట్టు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాలను 10 వేర్వేరు వాణిజ్య బ్యాంకుల్లోని ఖాతాల్లో జమ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భోటేకేషి నది విరుచుకుపడి తీవ్ర వరదలు సంభవించడంతో ప్రభావిత ప్రాంతాలను విపత్తు ప్రాంతాలుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వివిధ సంస్థలు, వ్యక్తులు సహాయ నిధికి విరాళాలు అందించారు. తాజా విరాళాలతో పీఎండీఆర్‌ఎఫ్‌లోని మొత్తం నిల్వలు రూ.217 కోట్ల నుంచి రూ.409 కోట్లకు పెరిగింది.








