
తన తండ్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో కవిత.. తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) పార్టీని, పసుపు, నీలం రంగులో ఉన్న పార్టీ జెండాను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఆనాటి కెసిఆర్, నేటి కెసిఆర్ వేరు అని అన్నారు.
ఆనాటి కెసిఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశారని గుర్తు చేశారు. కానీ మారిన, మర మనిషి కెసిఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదని ఘాటు విమర్శలు చేశారు. వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే అయ్యా కెసిఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా సార్ బయటకు రావటం లేదని అన్నారు. ఎక్కడ ఎవరికీ కష్టం వచ్చినా ఆ సార్ బయటకు రారు... ఎందుకంటే ఆయన ఆత్మలేని మర బొమ్మ అంటూ కవిత తీవ్ర పదజాలం వాడారు.
ఆనాడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన కెసిఆర్...నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయిన సరే పట్టించుకోలేదని కవిత విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా అంటూ ప్రశ్నించారు. అవినీతి చేస్తే కొడుకునైనా, కూతురినైనా సరే వదలనని కెసిఆర్ గతంలో చెప్పారని కవిత గుర్తు చేశారు. కానీ తాను కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని చెబితే, ఆ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.





