క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ

కొండా సురేఖ సిఎంకు రాఖీ కట్టినా.. ధర్మం ప్రకారమే తదుపరి చర్యలు

క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలని హైకమాండ్ ఆదేశం: మల్లు రవి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః పిసిసి క్రమశిక్షణా కమిటీ వేగం పెంచింది. మరో ఆరుగురు నేతలకు పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆదివారం గాంధీ భవన్‌లో క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమై ఫిర్యాదులను పరిశీలించారు. ఈ మేరకు ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. వారం రోజులలోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో ఆదేశించినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.

పార్టీకి నష్టం కలిగించారని ఆదిలాబాద్ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌కి, ఇంకా సంజీవ రెడ్డికి నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. గజ్వెల్ నియోజకవర్గంలో ఇంచార్జ్ నర్సారెడ్డికి- జూపల్లి మల్లారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశామని ఆయన చెప్పారు. పెద్దపల్లి ఎంపీ వంశీ కారు మీద దాడి చేసిన ఫిర్యాదులో గడ్డం త్రిమూర్తి, అక్క వెంకటేశ్వర్లు, అంకత శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్ సృజన్, ఆకుల ప్రసాద్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.

తాను పొరపాటు చేయనని, అలా చేస్తే ఎఐసిసికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. గతంలో తనకు టికెట్ రాకపోయినా పొత్తులో బిఆర్‌ఎస్ కోసం పని చేశానన్నారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌కి అనుకూలం అన్నారు. ఎవరిపై కక్షతో తాను నివేదిక ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డితో తనకు ఎటువంటి విభేదాలు లేవు అని ఆయన తెలిపారు. తనకు వారు మిత్రులేనని చైర్మన్, ఎంపీ మల్ల్లు రవి చెప్పారు. శనివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నకిరేకల్ సభకు వెళ్ళినప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొనడం మంచి పరిణామం అని ఆయన తెలిపారు. రాజగోపాల్ రెడ్డి లోగడం బిజెపిలో చేరి మళ్ళీ వెనక్కి వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఏ సమస్య అయినా చర్చలతో పరిష్కారం అవుతుందన్నారు.

రాష్ట్రంలో ధర్మపాలన..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ధర్మపాలన జరుగుతున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రాఖీ కట్టారని ఆయన తెలిపారు. తర్వాత పరిణామాలు ధర్మం ప్రకారం జరిగాయని, కానీ వాళ్ళ మీద ప్రేమ, గౌరవం తగ్గలేదన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలని పార్టీ ఆదేశించిందని ఆయన చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే గాంధీ భవన్‌కి వచ్చి ఫిర్యాదు చేయాలే తప్ప ధర్నా లు చేస్తే చర్యలు తప్పవని కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి హెచ్చరించారు.