
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలపడంతో వారిరువురికీ భారీ ఊరట లభించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి పంపించిన ఫైలుపై శనివారం గవర్నర్ శుక్లా సంతకం చేశారు. ఇక అధికారికంగా గెజిట్ విడుదల కావాల్సి ఉంది. గవర్నర్ కోటాలో మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే వీరిరువురిలో ప్రొఫెసర్ కోదండరామ్ కంటే కూడా అజహరుద్దీన్ అభ్యర్థిత్వంపైనే ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. అందుకు కారణం చట్ట సభలకు (ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ) ఎన్నిక కాకుండానే అజర్‌ను
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆరు నెలల్లోగా ఆ చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలల్లోగా ఎన్నిక కాని పక్షంలో రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం ఆరు నెలల గడువు ముగియగానే సదరు మంత్రి ‘మాజీ’గా మారిపోతారు. అయితే అజర్ విషయంలో ఉత్కంఠ నెలకొనడానికి అదే ప్రధాన కారణం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజర్ ఆరు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా లోక్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ శుక్లాతో సమావేశమై పరిస్థితిని వివరించి ఫైలును క్లియర్ చేయాల్సిందిగా కోరారు. దీంతో గవర్నర్ శుక్లా శనివారం ఫైలు క్లియర్ చేశారు.
సుప్రీంలో కేసుతో తర్జన-భర్జన
ఇదిలాఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ ఇదివరకే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయకుండా గవర్నర్ జాప్యం చేశారు. గత వారం ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు వాదనలు విన్న తర్వాత జూలై వ తేదీకి కేసును వాయిదా వేసింది. కోర్టు తీర్పు ఎలా వచ్చినా ముందుగా ఫైలు క్లియర్ చేయవచ్చని, తీర్పును బట్టి తదుపరి ఆలోచన చేయవచ్చని న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తోంది.
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ హర్షం
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తీసుకున్న నిర్ణయం పట్ల పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా మాజీ క్రికెటర్, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కోదండరామ్ పేర్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. సమాజానికి సేవ చేసిన వ్యక్తులకు కౌన్సిల్లో స్థానం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. ప్రజా జీవితం, క్రీడా రంగం, సామాజిక ఉద్యమాల్లో సేవలు అందించిన అజర్‌కు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండ రామ్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.











