
వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాస హోదా పొందాలని చూస్తున్న వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం కొత్త చిక్కులు తీసుకొచ్చింది. ప్రభుత్వ నుంచి మెడికెయిడ్, ఆహార సాయం, ఇతర జీవనాధార సహాయాలు పొందుతున్నవారిని కూడా ‘పబ్లిక్ ఛార్జ్’ పరిధిలోకి తీసుకురావడం ద్వారా గ్రీన్‌కార్డు దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలను పెంచింది. కొత్త నిబంధనలు సెప్టెంబరు 18 నుంచి అమల్లోకి రానున్నాయి.
అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) కొత్త నిబంధనలను ఖరారు చేసింది. గతంలో గ్రీన్‌కార్డు దరఖాస్తును తిరస్కరించేందుకు ‘పబ్లిక్ ఛార్జ్’గా పరిగణించే ప్రభుత్వ ప్రయోజనాలు ప్రధానంగా రెండు మాత్రమే ఉండేవి. ఆదాయ నిర్వహణ కోసం అందే నగదు సాయం, ప్రభుత్వ ఖర్చుతో దీర్ఘకాలం సంస్థాగత సంరక్షణలో ఉండటం మాత్రమే అందులోకి వచ్చేవి.
కొత్త నిబంధనల ప్రకారం.. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుడు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వంపై ఆధారపడే అవకాశముందా అన్నది నిర్ణయించేటప్పుడు యూఎస్‌సీఐఎస్ అధికారులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆదాయాన్ని బట్టి అందించే నగదు సాయం, గృహ సహాయం, ఆహార కూపన్లు, కళాశాల విద్యకు ఆర్థిక సాయం, ఇతర సమానమైన ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారా అన్నదీ పరిశీలిస్తారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2022లో బైడెన్ హయాంలో తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఛార్జ్’ నిబంధనలను రద్దు చేసిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు వచ్చాయి. తుది నిబంధనలను జులై 16న ప్రకటించగా.. జులై 20న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించారు.
శాశ్వత నివాస హోదా కోసం దాఖలు చేసే ఫారం ఐ-485కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. సెప్టెంబరు 18 లేదా ఆ తర్వాత పోస్టులో పంపిన లేదా ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులను కొత్త నిబంధనల ప్రకారం పరిశీలిస్తారు. దరఖాస్తుదారుడి వయసు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థితి, విద్యార్హతలు వంటి అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. అంతేకాదు.. దరఖాస్తుదారుడి ఆధారిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారా అన్నదీ పరిశీలనలోకి వస్తుంది. ఆ కుటుంబ సభ్యుడి వలస హోదా ఏదైనా కావొచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి భవిష్యత్తులో ప్రభుత్వంపై ఆధారపడే అవకాశం ఉందన్న కారణంతోనే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే పరిస్థితి ఉంటే.. యూఎస్‌సీఐఎస్ అధికారి ఆ వ్యక్తిని ‘పబ్లిక్ ఛార్జ్ బాండ్’ చెల్లించాలని కోరవచ్చు.
వలస వ్యవహారాల న్యాయవాదులు సైరస్ మెహతా, దమీరా జానటోవా విశ్లేషణ ప్రకారం.. యూఎస్‌సీఐఎస్ అధికారులకు దరఖాస్తులను తిరస్కరించే విషయంలో ఈ నిబంధన మరింత విచక్షణాధికారాన్ని కల్పిస్తుంది. స్టేటస్ మార్పు దరఖాస్తులకు అసాధారణ స్థాయి విచక్షణ అవసరమని యూఎస్‌సీఐఎస్ మెమో పేర్కొన్న నేపథ్యంలో ఈ అధికారం మరింత ప్రభావం చూపవచ్చని వారు తెలిపారు.
ఆరోగ్య రంగంలో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అంచనా ప్రకారం.. మెడికెయిడ్ లేదా చిప్ పథకాల కింద నమోదైన సుమారు 1.35 కోట్ల మంది కనీసం ఒక వలసదారు సభ్యుడున్న కుటుంబాల్లో నివసిస్తున్నారు. వీరిలో 56 లక్షల మంది అమెరికా పౌరులైన పిల్లలు ఉన్నారు. కొత్త నిబంధనల కారణంగా వీరి పథకాల నమోదు తగ్గే ప్రమాదం ఉందని సంస్థ పేర్కొంది. కొత్త ‘పబ్లిక్ ఛార్జ్’ నిబంధనల భయంతో వలసదారు కుటుంబ సభ్యులతో కలిసి మెడికెయిడ్, చిప్ పథకాలలో ఉన్న సుమారు 14 లక్షల నుంచి 41 లక్షల మంది వాటి నుంచి తప్పుకునే అవకాశం ఉందని విశ్లేషణ వెల్లడించింది. అయితే కొత్త ‘పబ్లిక్ ఛార్జ్’ నిబంధనల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులకు మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.








