
న్యూయార్క్: భారత 80వ స్వాతంత్య్ర వేడుకలు అమెరికాలోని న్యూయార్క్ ట్రై-స్టేట్ ప్రాంతంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా న్యూజెర్సీలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో ప్రపంచ రికార్డు నమోదైంది. క్వీన్స్‌లో జరిగిన ‘ఇండియా డే పరేడ్’లో న్యూయార్క్ నగర భారతీయ మూలాలున్న మేయర్ జోహ్రాన్ మమ్దానీ పాల్గొన్నారు. న్యూజెర్సీలోని పార్సిప్పనీలో వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో ‘లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్’ విభాగంలో గిన్నిస్ వరల్ రికార్డు నమోదైంది. భారత 80వ స్వాంతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా 1,300కు పైగా అమెరికా జెండాలను ‘250’ అనే సంఖ్య ఆకారంలో అమర్చారు. దీని చుట్టూ భారత త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు. దీనికి లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నెంబర్‌గా గిన్నిస్ రికార్డు లభించింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్స్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఏ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత సంతతకి చెందిన పలువురు ప్రతినిధులు, వ్యాపార, సామాజిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ టెక్నాలజీ సంస్థ జోహో కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చింది. ‘ఇండియా@80, అమెరికా@250 ప్రత్యేక వేడుకల్లో లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నెంబర్ విభాగంలో గిన్నిస్ వరల్ రికార్డు’ అంటూ భారత కాన్సులేట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
న్యూజెర్సీలోని జరిగిన కార్యక్రమం భారత-అమెరికా దేశాల మధ్య స్నేహానికి, ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతీయ-అమెరికన్ సమాజం చేస్తున్న నిరతర కృషికి ప్రతీకగా నిలిచినట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ డేల్ కాల్వెల్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు అనాలిలియా మెజియా, న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్, పార్సిప్పనీ మేయర్ పుల్కిత్ దేశాయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.








