మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రై వేటు జూనియర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు పట్టు బిగిస్తోంది. వసతుల లేని కళాశాలలపై దృష్టి సారించింది. నిబంధనల ప్రకారం సరైన ధృవపత్రాలు లేకుండా ఏటా షరతులతోనే అఫిలియేషన్లు పొందుతున్న కళాశాలలకు ఈ సారి అనుమతులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఫైర్ సేఫ్టీ,ఇతర నిబంధనలు పాటిస్తున్న కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇస్తోంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేలా అధికారులు చ ర్యలు చేపడుతున్నారు. ఆ తర్వాత బోర్డ్ నిబంధనల ప్రకారం కళాశాలల ల్యాబ్స్ ఇతర అం శాలపై దృష్టి పెట్టాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ భావిస్తున్నారు. విద్యార్థుల విషయంలో గతంలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకుని రా ష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీల పట్ల కఠినంగా వ్యవహరించాలని బోర్డు నిర్ణయించింది. అనుబంధ గుర్తింపు కోసం ప్రతి కళాశా ల నిబంధనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని ఆయా జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారులను(డిఐఇఒ) ఇప్పటికే ఆదేశించారు.

ఆయా జిల్లా పరిధిలో అనుమతి లేకుండా ఏ ఒక్క కళాశాల ఉన్నా జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి(డిఐఇఒ)లను బాధ్యులను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ, ఇతర అనుమతులు లేని కళాశాలలు గుర్తించి, ఆ కళాశాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పం దించకుంటే కళాశాలలు మూసివేస్తామని హె చ్చరించినట్లు తెలిసింది. ప్రైవేట్ జూనియర్ క ళాశాలలకు నిబంధనల ప్రకారం అన్ని ఉం టేనే అనుమతులు ఇచ్చేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా కళాశాలల గుర్తింపునకు అగ్నిమాపక నిరంభ్యంతర పత్రం(ఫైర్ ఎన్‌ఒసి), పక్కా భవనం లేదా రిజిష్టర్డ్ లీజ్ డీడ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్, సానిటరీ సర్టిఫికెట్, క్రీడా మైదానం, అర్హులైన అధ్యాపకులు, పిడి, లైబ్రరీ ఉండాలి. నిబంధనల ప్రకారం ఇవన్నీ ఉన్న కళాశాలలకే అనుబంధ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో ఏ ఒక్క కళాశాలకు అన్ని వసతులు ఉండడం లేదు. ఏదో ఒక అంశంలో కళాశాలలు ధృవపత్రాలు అందించడం లేదు.

అఫిలియేషన్ లేకపోయినా ప్రైవేట్ యాజమాన్యాలు ఏటా ప్రవేశాలు చేపట్టి, విద్యార్థుల భవిష్యత్తు పేరుతో ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి షరతులతో కూడిన అఫిలియేషన్ పొందుతున్నారు. తమ కళాశాలల్లో లేని వసతులను మూడు నెలల్లో సమకూర్చుకుంటామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బోర్డు అధికారులకు హామీపత్రం ఇస్తూ షరతులతో అఫ్లియేషన్ పొందుతున్నారు. తర్వాత ఆ వసతుల కల్పన గురించి పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతుండగా, ఈ సారి అఫిలియేషన్ల జారీ విషయంలో ఇంటర్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది.

నిబంధనలు పాటించని కాలేజీలకు జరిమానా విధింపు

రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడుతున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కఠిన చర్యలకు దిగింది. తప్పిదాలపై గుర్తింపు చర్యలు చేపట్టి, ఉల్లంఘనలకు పాల్పడిన కాలేజీలపై భారీ జరిమానాలు విధించింది. టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా ఇటీవల కాలేజీల్లో తనిఖీలు నిర్వహించగా, నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు ఇప్పటికే విధించినట్లు తెలిపింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగించి, జూనియర్ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనధికార అడ్మిషన్లు, అక్రమ కాలేజీ నిర్వహణలను అరికట్టేందుకు విస్తృత ప్రచారం నిర్వహించినట్టు తెలిపింది.

కాలేజీల్లో చేరే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ కాలేజీ అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) తప్పనిసరిగా పరిశీలించాలని పలుమార్లు సూచించినట్లు పేర్కొంది. కాలేజీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, అగ్నిమాపక భద్రత, విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలకు 2026 -27 విద్యాసంవత్సరానికి అఫిలియేషన్‌ను నిలిపివేసినట్లు బోర్డు ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తు రక్షణలో రాజీపడబోమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలు నిర్దేశిత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మరోసారి సూచించింది.