ఆసుస్ తన కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్‌లైన ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రాతో పాటు P3, P5 సిరీస్‌లను భారతదేశ టెక్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త శ్రేణిలో ఏఐ (AI) ఫీచర్లు, తేలికపాటి డిజైన్ ను అందించారు. కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌లు, మెరుగైన బ్యాటరీ లైఫ్, అధిక-నాణ్యత డిస్‌ప్లేలపై దృష్టి సారించింది. ముఖ్యంగా, ఈ పరికరాలు ప్రొఫెషనల్ వినియోగదారుల కోసం రూపొందించిన కోపైలట్ ప్లస్ పీసీ కేటగిరీలోకి వస్తాయి. ఈ క్రమంలో ఆసుస్ కొత్త ల్యాప్‌టాప్ సిరీస్ ధర, లభ్యత ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


ఏ మోడల్ ఎంత ఖరీదైనది

ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్7 సిరీస్ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా భారత టెక్ మార్కెట్లో రూ.2,39,990 ప్రారంభ ధరతో లభిస్తుంది. అలాగే మార్న్ గ్రే, జెట్ ఫాగ్ రంగులలో లభించే ఎక్స్‌పర్ట్‌బుక్ పి3 సిరీస్ రూ.94,990 నుండి ప్రారంభంఅవుతుంది. కాగా, పి5 సిరీస్ మాత్రం రూ.214,990 నుండి లభిస్తుంది. అయితే, ఈ అన్ని మోడల్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు వస్తాయి. ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా ఏప్రిల్ 29వ తేదీ వరకు ప్రీ-ఆర్డర్ కోసం కూడా అందుబాటులో ఉంది. దీనితో పాటు 5 సంవత్సరాల వారంటీ, రూ.20,000 తక్షణ తగ్గింపు, నో-కాస్ట్ EMI వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా: తేలికైన డిజైన్, శక్తివంతమైన ఏఐ పనితీరు

ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం, తేలికైన ల్యాప్‌టాప్. దీని బరువు సుమారు 0.99 కిలోలు. ఇది 1400 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో కూడిన 14-అంగుళాల WQXGA+ OLED లేదా టాండమ్ OLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్, ఇంటెల్ ARC గ్రాఫిక్స్‌తో వస్తుంది. ఇది 64 GB వరకు RAM, 2 TB వరకు స్టోరేజ్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో AI బూస్ట్ NPU అమర్చబడింది. ఇది 50 TOPs వరకు పనితీరును అందిస్తుంది. ఇది డాల్బీ అట్మోస్, ఆరు-స్పీకర్ల సెటప్, 1080p కెమెరా, పటిష్టమైన భద్రతా ఫీచర్లను కూడా అందిస్తుంది.


P3, P5 సిరీస్: వ్యాపార వినియోగదారుల కోసం స్మార్ట్ ఎంపికలు

ఈ ల్యాప్‌టాప్‌లు 14-అంగుళాల, 16-అంగుళాల డిస్‌ప్లే ఎంపికలను అందిస్తాయి. కొన్ని మోడళ్లలో యాంటీ-గ్లేర్, OLED స్క్రీన్‌లు కూడా ఉన్నాయి. పి3 సిరీస్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్‌లు ఉండగా, పి5 సిరీస్‌లో కొత్త అల్ట్రా 7 ప్రాసెసర్, ఏఐ (AI) సపోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు 32GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్‌ను అందిస్తాయి. పనిని సులభతరం చేయడానికి వీటిలో ఏఐ ఎక్స్‌పర్ట్‌మీట్, మై ఏసస్ (My ASUS) వంటి టూల్స్ కూడా ఉన్నాయి.


కనెక్టివిటీ, బ్యాటరీ, భద్రతా ఫీచర్లు

కొత్త ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్ వై-ఫై 7, బ్లూటూత్ 5.4, థండర్‌బోల్ట్ 4, ఒక యూఎస్‌బి పోర్ట్, హెచ్‌డిఎంఐ 2.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రాలో 70-వాట్-అవర్ బ్యాటరీ, 90W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. P3, P5 మోడల్‌లు వేర్వేరు బ్యాటరీ, ఛార్జింగ్ ఎంపికలను అందిస్తాయి. భద్రత కోసం, అన్ని ల్యాప్‌టాప్‌లలో TPM సపోర్ట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR కెమెరా, BIOS ప్రొటెక్షన్ ఉంటాయి. అంతేకాకుండా, అన్ని పరికరాలు మిలిటరీ-గ్రేడ్ మన్నికతో వస్తాయి.