కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. త్రిస్సూర్ తిరువంబడిలోని ఓ బాణసంచా తయారీ యూనిట్లో ఈ సంఘటన జరిగింది. బాణసంచా కోసం ఆ కేంద్రంలో సామగ్రిని ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ శబ్దం సుమారు కొన్ని

కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. తొలుత దీన్ని భూప్రకంపనలుగా భావించినట్టు వారు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై ప్రధానమంత్రి మోడీ, కేరళ సిఎం విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు.