రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతోంది. కాబట్టి, ఉదయాన్నే వాకింగ్ చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం వాతావరణం వేడిగా లేకపోయినా అజాగ్రత్తగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా, వేసవిలో ఉదయాన్నే ఎలాంటి ఆరోగ్య సమస్యలు, డీహైడ్రేషన్‌కు గురికాకుంటే ఖాళీ కడుపుతో నడవవచ్చని సూచిస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. 


ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాకింగ్ మానుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో తల తిరగవచ్చు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సీజన్‌లో నడకకు వెళ్లే ముందు నానబెట్టిన శనగలు వంటి తేలికపాటి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే ఎక్కువగా తినడం లేదా నడకకు ముందు టీ, కాఫీ తాగడం వంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని డీహైడ్రేట్  చేసే ప్రమాదం ఉంది. 


వేసవిలో ఈ సమస్య ఎందుకు?

వేసవిలో  వేడి తీవ్రత కారణంగా శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. దీంతో కడుపు ఖాళీగా ఉండి, శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివలన నీరసం, తలనొప్పి లేదా డీహైడ్రేషన్‌కు గురి కావచ్చు. ముఖ్యంగా వడగాలుల సమయంలో ఈ ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల ఏదైనా తిని, తగినంత నీరు త్రాగిన తర్వాత మాత్రమే వాకింగ్ కు వెళ్ళాలి. ఈ సమయంలో ఎక్కువగా చెమట పడుతుంటే, తేలికపాటి నడకకే పరిమితం కావాలని గుర్తుంచుకోండి.


వేసవిలో వాకింగ్ ఎప్పుడు చేయాలి?

ఈ సీజన్‌లో ఉదయం 5 నుండి 6 గంటల మధ్య నడవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.