
దుబాయ్: హార్మూజ్ జలసంధిలో బుధవారం ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులకు దిగింది. ఈ దాడిలో నౌక దెబ్బతినగా, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన చర్చల ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇరాన్‌కు చెందిన పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్ చర్చలకు ముందు టెహ్రాన్ ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు రావడానికి సమయం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పొడిగింపు దౌత్యపరమైన ప్రయత్నాలకు మరింత సమయం ఇస్తుందని పేర్కొన్నారు.
మాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు పాకిస్థాన్ తన నిజాయితీగల ప్రయత్నాలను కొనసాగిస్తుంది అని షెహబాజ్ షరీఫ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్ పోర్టులపై అమెరికా అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీనిని ఇరాన్ అంగీకార యోగ్యం కానిదిగా అభివర్ణించింది. ఇస్లామాబాద్ చర్చలకు ఇప్పటివరకు అంగీకరించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని టెహ్రాన్ సంకేతాలు ఇచ్చింది. ఇక రివల్యూషనరీ గార్డ్స్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న శత్రువుల ఆస్తులపై వారి ఊహకు అందని విధంగా ఘోరమైన దెబ్బలు కొడతాం అని ప్రకటించాయి.గత వారాంతంలో అమెరికా, ఇరాన్‌కు చెందిన ఓ కంటైనర్ నౌకపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవడం, అలాగే భారత మహాసముద్రంలో ఇరాన్ చమురు వ్యాపారంతో సంబంధం ఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఎక్కి తనిఖీలు నిర్వహించిన తర్వాతే ఈ తాజా దాడి జరిగింది.
బ్రిటిష్ సైన్యం ఆధ్వర్యంలో పనిచేస్తున్న యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 7:55 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులకు ముందు రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన గన్‌బోట్ నౌకను హెచ్చరించలేదని వెల్లడించింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని కూడా స్పష్టం చేసింది.హార్మూజ్ జలసంధిలో నౌకపై జరిగిన కాల్పుల ఘటనపై ఇరాన్ మీడియా భిన్న వివరణలు ఇచ్చింది. ఇరాన్‌కు చెందిన ‘నూర్ న్యూస్’ ప్రకారం, ఇరాన్ సాయుధ దళాల హెచ్చరికలను ఆ నౌక పట్టించుకోకపోవడంతోనే రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఇరాన్‌కు చెందిన అధికారిక వార్తా సంస్థ ‘ఫార్స్’ కూడా ఈ చర్యను సమర్థించింది. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను చట్టబద్ధంగా అమలు చేసిన చర్యగానే ఈ దాడిని అభివర్ణించింది.
హార్మూజ్ జలసంధి
ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో సుమారు 20 శాతం ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారానే సాగుతుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి అంతర్జాతీయ సముద్ర మార్గాలకు కలుపుతున్న ఈ జలసంధి, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభమయ్యే వరకు పూర్తిగా తెరిచి ఉండేది. అయితే అప్పటి నుంచి టెహ్రాన్ హార్మూజ్ గుండా నౌకల రాకపోకలను కట్టడి చేయడంతో అంతర్జాతీయ చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగి, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 98 డాలర్ల సమీపానికి చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇది 30 శాతానికి పైగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరిపించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఇరాన్ అధికారికంగా అంగీకారం తెలియజేయకపోయినా, టెహ్రాన్ చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపుతుందనే నమ్మకం పాకిస్థాన్ అధికారుల్లో ఉందని సమాచారం.
ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. గత వారాంతంలో అమెరికా నుంచి కొత్త ప్రతిపాదనలు అందినట్లు ఇరాన్ తెలిపినా, ఇరువైపుల మధ్య ఇంకా గణనీయమైన విభేదాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మద్దతు గల మిలీషియా గ్రూపులు, హార్మూజ్ జలసంధి నియంత్రణ వంటి అంశాలే చర్చలకు ప్రధాన అడ్డంకులుగా మారినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించిన అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందించారు. ఈ నిర్ణయం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలకు, పరస్పర విశ్వాస నిర్మాణానికి అత్యంత కీలక అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో కనీసం 3,375 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లెబనాన్‌లో 2,290 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఇజ్రాయెల్‌లో 23 మంది మృతి చెందారు. గల్ఫ్ అరబ్ దేశాల్లో డజన్‌కు పైగా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్‌లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతవ్యాప్తంగా 13 మంది అమెరికా సైనిక సిబ్బంది కూడా ఈ ఘర్షణల్లో మరణించినట్లు సమాచారం.













