
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘో ష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రా యం వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. సిబిఐకి ఘోష్ కమిషన్ పంపిన రిపోర్టులో ఎవరి పేర్ల ను పేర్కొనలేదని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. హై కోర్ట్ తీర్పు వెలువడిన తరువాత సిఎం రేవంత్‌రెడ్డి తో మంత్రి ఉత్తమ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, హై కో ర్టు తీర్పుపై వారిద్దరూ చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 6ను కొట్టివేయాలని పిటీషనర్లు హై కోర్టును ఆశ్రయించారని, కానీ, జ్యుడిషియల్ క మిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదని ఆయ న స్పష్టం చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని ఆయన తెలిపారు. కమిషన్ ఫైండింగ్‌లను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జిఓ ఎంఎస్ నెంబ ర్ 6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
సిబిఐకు లేఖ రాశాం
కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మించింది కాదని, అసమంజసం కాదని, అక్రమం కాదని న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్దారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని ఆయన చెప్పారు. పిటీషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్ర కారం నోటీసు ఇవ్వలేదన్న టెక్నికల్ అంశాన్ని హైకోర్టు తప్పుపట్టిందన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటీషనర్లకు రిలీఫ్ ఇచ్చిందని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపా లు, అవకతవకలపై సిబిఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించిందని, దానిపై సిబిఐకు లేఖ రాశామని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. ఈ రోజు వెలువడిన హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కా దని, న్యాయస్థానం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం నిజం
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ముమ్మాటికీ నిజమన్నారు. ప్రాజెక్టుకు ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్‌ల నుంచి నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగాయని అన్నీ లోపాలే ఉన్నాయని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా, వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్ మాత్రమే ఇన్ ఆపరేటివ్‌గా ఉంటాయని హైకోర్టు తెలిపిందన్నారు. ఇది పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలను బయటపెట్టిన విజిలెన్స్
2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ బ్యారేజీ దగ్గరకు వెళితే ఎవరికైనా కుంగిన తీరు కనపడుతుందన్నారు. లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ మూడేళ్లకే కుంగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయంలోనే కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కారణాలేమిటో తేల్చాల్చిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్ల, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బిఆర్‌ఎస్ హయాంలోనే సమర్పించిందని మంత్రి తెలిపారు.
బ్యారేజీలకు ఎంచుకున్న ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలను తమ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ బయటపెట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.తీర్పు కాపీ వచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుందన్నారు. కేవలం రెండు ఫిల్లర్లు కాదని, మొత్తం పౌండేషన్, మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నా యని, ఇప్పటికే దేశంలో పేరొందిన సంస్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.













