వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి , రిపబ్లికన్ నేత హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని బట్టి ఇరాన్‌కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని కొట్టి పారేయలేమని ఆరోపించారు.

ఈ తొస్కా నౌక అనేక సార్లు చైనాకు వెళ్లిందని, ఇరాన్ క్షిపణుల తయారీకి కావలసిన రసాయనాలను తీసుకొచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. గత ఆరు వారాల్లో ఈ నౌక చైనాకు రెండు సార్లు వెళ్లిందని పేర్కొంది. మరోవైపు తౌస్కా నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాను హెచ్చరించింది.

ఇరాన్ నౌకతో మా సంబంధం లేదు: చైనా

అమెరికా సీజ్ చేసిన ఇరాన్ తౌస్కా వాణిజ్య నౌకలో క్షిపణుల తయారీకి కావలసిన చైనా రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. “నాకు తెలిసినంతవరకు , ఇది విదేశీ పతాకం కలిగిన నౌక. దాంతో తమ దేశానికి సంబంధం ఉందన్న దుష్ప్రచారాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం ” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి గుయో జియా కున్ పత్రికా విలేకరులకు చెప్పారు. అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.