బెంగళూరు, హర్యానా డిఫెన్స్ మద్యం విక్రయం

రూ.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం

మనతెలంగాణ, సిటిబ్యూరోః నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసిన ఇంటిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 361 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి హస్తినాపురంలో ఉంటున్నాడు.

గత కొంత కాలం నుంచి సురేష్ బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంటీన్ల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను హస్తినాపురానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శ్రీరమణ కాలనీ, ఫేజ్2లోని ఇంట్లో దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న సురేష్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు దర్యాప్తు కోసం మద్యం బాటిళ్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.